గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ చేసిన తప్పులే…నేడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు టీడీపీ శాసనసభాపక్ష ఉప నేతలు కె.అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదనే కఠిన నిర్ణయాన్ని తీసుకోడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. గతంలో 67 మంది శాసనసభ్యులున్న వైసీపీకి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను అడ్డు పెట్టుకుని టీడీపీ సాగించిన నియంతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంబించిన అప్రజాస్వామిక విధానాలకు టీడీపీ భారీ మూల్యమే చెల్లించింది. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ పాలన నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన జగన్ ప్రభుత్వం, ఆ పని చేయకపోగా, తాను కూడా అదే బాటలో నడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం తమకు మైక్ ఇవ్వలేదు కాబట్టి, తాము కూడా ఇప్పుడు ఇవ్వమనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ ప్రభుత్వం కంటే భిన్నమైన, ప్రజాస్వామ్య , భావప్రకటనా స్వేచ్ఛతో కూడిన పాలన అందించాలని, అందిస్తారనే నమ్మకంతో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఇద్దరు ప్రజాప్రతినిధులకే చట్టసభలో మాట్లాడే హక్కుల్ని కాలరాస్తే… ఇక వారు ఎక్కడ మొర పెట్టుకోవాలి? సభా సంప్రదాయాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు వ్యవహరించి వుంటే , అందుకు తగిన శిక్ష విధించొచ్చు.
కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల సంఘం తనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల సాకుతో ప్రత్యర్థి పార్టీకి చెందిన శాసనసభ్యుల గొంతు నులమడం నైతికంగా సబబా? అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాల్సి వుంది. ఇక అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకుంటే, ఆ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చట్టసభ సమావేశాలకు హాజరు కావడం ఎందుకు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాగే ప్రత్యర్థులపై తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడడం వల్ల ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. చట్టసభలో వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనసభను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలో తన గళాన్ని వినిపించేందుకు పాదయాత్ర చేపట్టారు. టీడీపీ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రం కంటే గొప్పదైన చట్ట సభ ఏముంటుంది? అని నాడు ఆయన ప్రజల మధ్యకెళ్లారు.
కావున టీడీపీ పాలనను గుర్తు తెచ్చేలా తన పాలన ఉండకూడదని వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీకి చెందిన సభ్యులకు మైక్ ఇవ్వకూడదనే కఠిన నిర్ణయంపై పునరాలోచించాలి. ఎందుకంటే ఈ విషయమై ప్రజల్లో అనవసర చర్చకు అవకాశం ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది. అన్నీ తెలిసి ప్రత్యర్థుల నోళ్లు మూయించడానికే ప్రభుత్వం మొగ్గు చూపితే చేయగలిగేదేమీ లేదు. గతంలో తాను చూపిన దారే ఇప్పటి ప్రతిపక్షానికి వుంటుందని పాలక పక్షం గుర్తెరిగితే మంచిది.