హూజూరాబాద్ లో 92, బ‌ద్వేల్ లో 35!

ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. ఈ నేప‌థ్యంలో రెండు చోట్లా పెద్ద సంఖ్య‌లోనే నామినేష‌న్లు దాఖ‌లు కావ‌డం గ‌మ‌నార్హం! హోరాహోరీ పోరు జ‌రుగుతున్న హుజూరాబాద్ లో…

ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. ఈ నేప‌థ్యంలో రెండు చోట్లా పెద్ద సంఖ్య‌లోనే నామినేష‌న్లు దాఖ‌లు కావ‌డం గ‌మ‌నార్హం! హోరాహోరీ పోరు జ‌రుగుతున్న హుజూరాబాద్ లో మొత్తం 92 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీ నుంచి త‌ప్పుకున్న బ‌ద్వేల్ లో 35 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. 

హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య‌న ప్ర‌ధాన పోటీ నెల‌కొంది. అయితే ఈ ఉప‌పోరులో స్వ‌తంత్రులు, ఇత‌ర పార్టీల వాళ్లు కూడా పెద్ద ఎత్తున నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంపై నిర‌స‌న తెల‌ప‌డానికి కొంద‌రు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. దీంతో మొత్తం దాఖ‌లైన నామినేష‌న్ల సంఖ్య 90 ను దాటింది. అలాగే వీరిలో రెండు సెట్ల నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసిన వారు కూడా ఉన్నారు. దీంతో.. కూడా సంఖ్య పెద్ద‌గా న‌మోదైంది.

దాదాపు 62 మంది 92 నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశార‌ని అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి. వీరిలో రెండు సార్లు, రెండు సెట్ల నామినేష‌న్లు దాఖ‌లు చేసిన వారు ఉన్నారు. 

ఇక బ‌ద్వేల్ విష‌యానికి వ‌స్తే.. అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే ప్ర‌ధాన పోటీదారుగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నిక పోరు నుంచి త‌ప్పుకుంది. అభ్య‌ర్థి పేరును ఒక‌టికి రెండు సార్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత టీడీపీ ఈ పోరు నుంచి త‌ప్పుకుంది. అంత‌కు ముందు జన‌సేన కూడా త‌ప్పుకుంది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీలో ఉన్నాయి. వాటికి తోడు.. చిన్నాచిత‌క పార్టీలు, స్వ‌తంత్రులు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. దీంతో మొత్తం నామినేష‌న్ల సంఖ్య 35కు చేరింది.