మైనర్ బాలికను ఓ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ట్రాప్ చేశాడు. యువకుడి మాయ మాటలు నమ్మి ఆ బాలిక ఎటో వెళ్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో ఆ తండ్రి మనస్తాపం చెంది బలవన్మరణం చెందాడు. చివరికి ఆ బిడ్డని ఎలాగోలా పోలీసులు గుర్తించి చైల్డ్‌హోంకు చేర్చారు. కానీ ఏం లాభం… అప్పటికే తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన మంత్రి నాగరాజుకు తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు ఉంది. ఈ బాలికకు ఫేస్‌బుక్‌లో తిరుపతికి చెందిన రాజశేఖర్ (28) అనే యువకుడు పరిచయం అయ్యాడు. వాళ్లిద్దరూ చాటింగ్ చేసుకుంటూ పరిచయాన్ని పెంచుకున్నారు. అది కాస్తా సాన్నిహిత్యాన్ని పెంచింది. తిరుపతి రావాలని కోరడంతో బాలిక ఏమీ ఆలోచించకుండా ఈ నెల 7న వెళ్లిపోయింది.
కూతురు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కూతురి ఆచూకీ కోసం ఎన్నో చోట్ల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ నెల 8న బాలిక తండ్రి నాగరాజు పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు సమాజం నుంచి ఎదురైన ఛీత్కారాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ నెల 16న పోలీస్‌స్టేషన్ సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. బాలిక సెల్‌ఫోన్ తీసుకెళ్లకపోవడంతో ఛేదించడం కష్టమైంది. లోతుగా దర్యాప్తు చేశాక బాలిక తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు. కూపీ లాగడంతో పైడి రాజశేఖర్ అనే తిరుపతి యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ప్రేమాయణం సాగించి బాలికను ట్రాప్ చేసినట్టు తేల్చారు. బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి రప్పించి దాచి పెట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. బాలికను అదుపులోకి తీసుకుని చైల్డ్‌హోంకు తరలించారు.
నిందితుడు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాలికకు తెలిసీతెలియని వయసులో ప్రేమ పేరుతో వంచించిన రాజశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రేమ వంచనకు ఓ నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.