ఈనాడు అధినేత రామోజీ తనకో న్యాయం, జగన్ సర్కార్‌కో న్యాయమని చెబుతున్నాడు. ఇతరులకు చెప్పేందుకే నీతులు, తనకు కాదని ఈనాడు రాతల ద్వారా రామోజీ ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడు. ఎలాగైనా మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవాలనే చంద్రబాబు పట్టుదలే తన ఆశయంగా రామోజీ అక్షర వంటకాన్ని కొనసాగిస్తున్నాడు. ఈనాడులో ‘అన్నీ అమరిన రాజధాని తరలింపు ఎందుకు?’ శీర్షికతో గురువారం ప్రచురించిన వార్తా కథనం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనం.
‘ఒక రాష్ట్ర రాజధానికి ఏం కావాలి. శాసనసభ, సచివాలయం, హైకోర్టు….ఇంతకంటే ఏం కావాలి? నిన్న మొన్నటి వరకు బలంగా వినిపించిన వాదన ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవన్నీ ఉన్నాయి. మూడేళ్లుగా పాలన ఇక్కడే సాగుతోంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే వ్యవస్థ ఉంది. ఇలా అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది? ఉన్న వసతులతోనే …అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండానే పరిపాలన కొనసాగించవచ్చు కదా’ అని ఈనాడులో ‘అన్నీ అమరిన రాజధాని తరలింపు ఎందుకు?’ శీర్షికలో పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఇచ్చిన ఈనాడును కొన్ని ప్రశ్నలకు సమాధానాలను జనం కోరుతున్నారు.
‘ఒక పత్రికకు ఏం కావాలి. ఎడిషన్ కార్యాలయం ఉంటే సరిపోతుంది. అందులో ప్రింటింగ్ మిషన్లు, ప్రధాన కార్యాలయమైతే ఎడిటర్ అదనం. రీజనల్ సెంటర్లలోనైతే ఎడిషన్ ఇన్‌చార్జ్‌లు, బ్రాంచి మేనేజర్లు, సబ్ ఎడిటర్లు, షెడ్యూలింగ్ ఇన్‌చార్జ్‌లు, యాడ్ డిజైనర్లు, సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్ తదితర శాఖల సిబ్బంది పనిచేసే సౌకర్యం ఉంటే చాలు. మరి ఈనాడుకు సంబంధించి హైదరాబాద్‌లో సోమాజిగూడలో, మూసాపేటలో పత్రికకు కావాల్సిన అన్ని సదుపాయాలున్నాయి. అలాగే 1980లో తిరుపతిలలో ఈనాడు ఎడిషన్ నెలకొల్పారు. మరి సోమాజిగూడ, మూసాపేట నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి, తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని నేండ్రగుంట ఎడిషన్‌కు అత్యవసరంగా సిబ్బందిని ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఎంతో ప్రధాన మార్గంలో, సెంటర్‌లో ఉన్న కార్యాయాలను మూసేయాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సోమాజిగూడ, మూసాపేటలో ఉన్న సిబ్బందిని సుదూరంలో సుమారు 2.30-3 గంటల పాటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితిని ఎందుకు కల్పించారు. ఈ కార్యాలయాల మార్పు మూడు, నాలుగేళ్ల కిందటే చేశారు కదా? అలాగే టాబ్లాయిడ్‌ను 16 పేజీల నుంచి 12 పేజీలకు ఎందుకు తగ్గించారు? పేజీలను తగ్గించడంతో పాటు పత్రిక ధరను ఎందుకు పెంచారు? ఆరేడేళ్ల క్రితం పీసీ సెంటర్స్‌ను ఎత్తేసి హోం టూ డెస్క్ వర్క్ కల్చర్‌ను మీరు చేపట్టలేదా? సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు దిగ్విజయంగా వినియోగించుకుంటూ, జగన్ సర్కార్ విషయానికి వస్తే ఎందుకు తప్పుగా కనిపిస్తోంది.
మూసాపేట కార్యాలయంలో హైదరాబాద్ , రంగారెడ్డి, మెదక్, ఢిల్లీ మెట్రో టాబ్లాయిడ్‌లకు సంబంధించిన సబ్ ఎడిటర్స్ పనిచేసే వారు కాదా? అలాగే సోమాజిగూడలో ఈనాడు జనరల్ డెస్క్ సిబ్బంది పనిచేసేవాళ్లు కదా? ఎందుకు వీళ్లందరిని ఇబ్బంది పెట్టారో చెప్పగలరా?
16 పేజీల టాబ్లాయిడ్ తయారీకి రూ.28 ఖర్చును తగ్గించేందుకు 12 పేజీలకే కుదించలేదా? దీన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కాకపోతే మీరు చేస్తే ఒప్పు, జగన్ సర్కార్ చేస్తే తప్పు ఎందుకు అవుతోందనేదే ప్రధాన ప్రశ్న. జర్నలిజం విలువలకు పాతరేస్తూ వ్యక్తిగత, టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాల కోసం ఇంకెంత కాలం ఇలా.