వైసీపీ ఎమ్మెల్సీకి అనూహ్య స్పందన

ఆయన రాజకీయ దురదృష్టవంతుడుగా సొంత పార్టీలోనే పేరు తెచ్చుకున్నారు. పుష్కర కాలం రాజకీయం చేసినా కూడా ఒక్కటంటే ఒక్క అధికార పదవి ఆయనను వరించలేదు. చేతికొచ్చినది నోటిదాకా రాకుండా ఎన్నో సార్లు దెబ్బ కొట్టింది.…

ఆయన రాజకీయ దురదృష్టవంతుడుగా సొంత పార్టీలోనే పేరు తెచ్చుకున్నారు. పుష్కర కాలం రాజకీయం చేసినా కూడా ఒక్కటంటే ఒక్క అధికార పదవి ఆయనను వరించలేదు. చేతికొచ్చినది నోటిదాకా రాకుండా ఎన్నో సార్లు దెబ్బ కొట్టింది. అలా విధి వంచితుడుగా మిగిలిన ఆయనను జగన్ ఎట్టకేలకు దీవించి ఎమ్మెల్సీని చేశారు.

ఆయనే విశాఖ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయనకు పదవి రావడం అంటే సంబరం ఆయనకే పరిమితం కాలేదు, మొత్తం వైసీపీ కుటుంబానిదే అయింది. అంతకు మించి రాజకీయాలకు అతీతంగా ఆయనను ప్రేమించి అభిమానించే వారిది అయింది.

దానికి నిదర్శనంగా ఒక పెద్ద నాయకుడు విశాఖకు వస్తే జనం పోటెత్తిన తీరుగా వంశీ కోసం జనం వెల్లువలా కదలివచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి విశాఖకు వస్తే ఆయనకు రిసీవ్ చేసుకోవడానికి విరగబడిన ప్రజలను చూస్తే చాలు వంశీ సాధించింది పదవి మాత్రమే కాదు, దానికంటే మించిన ప్రజాదరణ అని.

ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వంశీ జగన్ కి వీర విధేయుడు. వర్తమాన రాజకీయాలకు భిన్నంగా పార్టీని నమ్ముకుని అదే పార్టీ ద్వారా చట్ట సభకు ఎంపికైన నేత. ఈ రోజులో పదవి దక్కకపోతే పక్క పార్టీ వైపు పోతారు. కానీ వంశీకి ఉన్న నిబద్ధత, జగన్ మీద ఆయనకు ఉన్న నమ్మకం. జగన్ కి ఆయన మీద అభిమానం ఇవన్నీ వెరసి విశాఖలోనే కాదు, ఏపీలోనే   అరుదైన రాజకీయానికి బాటలు వేశాయని చెప్పాలి.

ఇక ఎమ్మెల్సీగా కాదు, రావాల్సింది మంత్రిగానే అంటున్నారు అభిమానులు. ఏమో గుర్రం ఎగరావచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. చిత్తశుద్ధి, నిజాయతీ ఉన్న వారికి అవకాశాలు అవే తోసుకుంటూ వస్తాయి. వంశీకి ఉన్న నిండైన ప్రజా దీవెన ఇంకా ఎన్ని ఎత్తులకు ఆయన్ని తీసుకెళ్తుందో చూడాల్సిందే.