హమ్మయ్య.. శుభవార్త చెప్పిన అమెరికా

మొన్నటివరకు కరోనా టీకాలపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. మరీ ముఖ్యంగా కోవాక్సిన్ తీసుకున్నవాళ్లకు అమెరికా, బ్రిటన్ తో సహా చాలా దేశాల్లో అనుమతి నిరాకరణ అంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు అమెరికా నుంచి…

మొన్నటివరకు కరోనా టీకాలపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. మరీ ముఖ్యంగా కోవాక్సిన్ తీసుకున్నవాళ్లకు అమెరికా, బ్రిటన్ తో సహా చాలా దేశాల్లో అనుమతి నిరాకరణ అంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు అమెరికా నుంచి ఈ దిశగా కీలక ప్రకటన వచ్చింది. వ్యాక్సినేషన్ విషయంలో తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరట లభించింది.

ఈ మేరకు అమెరికన్ ఎంబసీ విస్పష్టంగా ఓ ప్రకటన చేసింది. అమెరికాలో అడ్మిషన్ పొంది తక్షణం రావాలనుకుంటున్న విద్యార్థులకు వ్యాక్సినేషన్ అడ్డంకి కాదని తెలిపింది. కేవలం ప్రయాణానికి 3 రోజుల ముందు కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకొని, నెగెటివ్ వచ్చినట్టు రిపోర్ట్ సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది.

అయితే కొన్ని యూనివర్సిటీలు తీసుకున్న నిర్ణయంపై మాత్రం అమెరికన్ ఎంబసీ కలుగజేసుకోలేదు. ప్రవేశానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని యూనివర్సిటీలు నిబంధనలు పెట్టాలి. మరికొన్ని వర్సిటీలు తమ ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాయి. వీటిని మాత్రం ఎంబసీ తోసిపుచ్చలేదు. 

ఆ యూనివర్సిటీలు చెప్పినట్టు విద్యార్థులు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. భారతదేశంలో వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, తప్పనిసరిగా స్థానికంగా మరో టీకా వేయించుకోవాలని కొన్ని వర్సిటీలు నిబంధనలు పెట్టాయి.

మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం అనుమతి నిరాకరించింది. కేవలం విద్యార్థుల్ని మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేసింది. కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు రావొచ్చని సూచించింది. వీసా మంజూరుకు సంబంధించి సర్వర్ పై భారం తగ్గించేందుకు.. అలాంటివాళ్లు వీసాలకు అప్లయ్ చేయొద్దని ముందస్తుగా సూచనలు జారీచేసింది.

అటు వీసాల కోసం ఇప్పటికే చెల్లించిన డబ్బుకు వ్యాలిడిటీ ముగిసిందనే భయం వద్దని, దాన్ని పొడిగిస్తామని కాన్సులేట్ ప్రకటించింది. సోమవారం నుంచి వీసా కన్సల్టేషన్ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఇండియా నుంచి ఉన్న డిమాండ్ దృష్ట్యా సర్వర్ క్రాస్ అయ్యే ప్రమాదముందని నిపుణులు భావిస్తున్నారు.