ఏబీవీ…సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. ఏబీ వెంకటేశ్వరరావుకుగా ఏపీ సమాజానికి పరిచయమైన ఉన్నతాధికారి. చంద్రబాబు హయాంలో కంటిచూపుతో శాసించిన ఉన్నతాధికారి. తానొక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిననే విషయాన్ని మరిచి , పచ్చ కండువా వేసుకున్నట్టుగా చంద్రబాబు, టీడీపీ నేతలకు మించి రాజకీయాలు చేసి… ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నాడు టీడీపీలోకి జంప్ కావడంలో కీలక సూత్రధారి ఏబీవీ అనే ఆరోపణలున్నాయి. దాని పర్యవసానాలను నేడు ఆయన అనుభవిస్తున్నారు.
ఏబీవీ ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదంటే… ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసే వరకూ. దీన్ని బట్టి ఏబీవీపై జగన్ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వం సిఫార్సు చేయగానే, కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేస్తుందా? అంటే అది ఇప్పుడే తెగే పని కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులను సర్వీసు నుంచి డిస్మిస్ చేయడం అంత సులభం కాదని సమాచారం. అవినీతి, మహిళలతో అసభ్య ప్రవర్తన, సర్వీస్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడం తదితర అభియోగాలు రావడంతో పాటు వాటిని సంబంధిత వ్యవస్థలు ధ్రువీకరించాకే శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంటుంది. ఇలా సర్వీస్ నుంచి తొలగించిన ఘటనలు ఒకట్రెండు తప్ప అసలు లేవనే చెప్పాలి.
కానీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తేనే ఏబీవీ బాధ పడతారని, లేకపోతే సంతోషంగా ఉంటారని భావిస్తే… అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు. జగన్ ప్రభుత్వం భారీ విజయం నమోదు చేసుకున్నప్పటి నుంచే ఏబీవీ మానసికంగా అనుభవిస్తున్న వేదిస్తున్న ఆయనకు తప్ప రెండో మనిషికి తెలియకపోవచ్చు. ఆ బాధ ఇతరులతో చెప్పుకున్నా పోయేది కాదు. ఏపీలో ఎంతో మంది ఉన్నతాధికారులున్నారు. జగన్ అధికారంలోకి వస్తే… ఎవరికీ లేని భయం, ఆందోళన ఒక్క ఏబీవీకే ఎందుకు అని ప్రశ్నించుకుంటే, అందులోనే సమాధానం దొరుకుతుంది.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో సమాచారం ఇచ్చే వరకూ పరిమితమై ఉంటే ఏబీవీకి నేడు ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఆయన చంద్రబాబు మెప్పు కోసం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీని అంతమొందించేందుకు తనది కాని పనిలోకి దిగారు. పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్పుడే జగన్ తదితర వైసీపీ నేతలు ఏబీవీపై విమర్శలు సంధించారు. మొదట్లోనే తన వైఖరి మార్చుకుని ఉంటే ఏబీవీ సేఫ్ సైడ్‌లో ఉండేవారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు శాశ్వతమని భావించి, పరిధికి మించి ప్రవర్తించిన ఏబీవీ, ప్రస్తుతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఇజ్రాయెల్ నిఘా పరికరాలను కొనుగోలు చేయడానికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరి 8న ఏబీవీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఏబీ ఊపిరి తీసుకోకుండా రకరకాల విచారణలు మొదలయ్యాయి. సీఐడీ, పోలీస్ ఉన్నతాధికారులతోపాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి తనపై కుట్ర చేస్తున్నారని.. తాను అక్రమాలకు పాల్పడినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆలిండియా సర్వీసు రూల్స్ ఉల్లంఘించి మీడియా ముందుకొచ్చి ఏబీ మాట్లాడారని ప్రభుత్వం మరో విచారణకు ఆదేశించింది. విచారణ బాధ్యతను ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా (కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ్‌స)కు అప్పగించారు. ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా న్యాయవాది సర్వ శ్రీనివాసరావును నియమించారు. ఈ విచారణపై ఏబీవీకి టెన్షన్ తప్పలేదు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా…తాజాగా ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ద్వారా ఏబీవీపై డిస్మిస్ అమలు చేయాలని కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో ఏబీవీపై ఉన్న అభియోగాలు, విచారణలో నిగ్గు తేలిన అంశాలను పేర్కొని ఒక అభియోగ పత్రాన్ని కేంద్రానికి పంపడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు, అభియోగ పత్రాలను సమగ్రంగా పరిశీలించాక… యూపీఎస్‌సీ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.
అనంతరం డిస్మిస్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. కానీ ఈ వ్యవహారం ఏబీవీ మనసులో సృష్టించే మానసిక కల్లోలానికి మించిన శిక్ష మరొకటి ఏముంటుంది? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా బ్యూరోక్రాట్స్ నుంచి ఏబీవీకి కనీస మద్దతు కూడా రావడం లేదు. దీన్ని బట్టి ఆయన వ్యవహారశైలి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏబీవీ రోజురోజుకూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారనేందుకు జగన్ ప్రభుత్వం తాజా జీవోనే నిదర్శనం.