ఏలూరు కార్పొరేషన్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కరోనాపై ఓడిన ఇద్దరు అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో విజయం సాధించడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 10న ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి.
ఓటర్ల జాబితాలో అవకతవక లున్నట్లు హైకోర్టులో కేసు దాఖలైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలో తరువాత ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది.
ఈ క్రమంలో కేసును కొట్టివేస్తూ కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలని మే 7న న్యాయస్థానం ఆదేశించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు రెండు నెలల పాటు ఎస్ఈసీ బ్రేక్ వేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మూడు డివిజన్లు మినహాయించి 47 డివిజన్లను వైసీపీ దక్కించుకుంది.
అయితే కరోనా బారిన పడిన ఇద్దరు వైసీపీ అభ్యర్థులు మృతి చెందడం గమనార్హం. వీళ్లిద్దరూ కూడా ఘన విజయం సాధించారు. కానీ గెలుపును ఆస్వాదించడానికి ఇద్దరు వైసీపీ అభ్యర్థులు జీవించలేరు. 45వ డివిజన్ అభ్యర్థి బేతపూడి ప్రతాపచందర ముఖర్జీ 1058 ఓట్లతోనూ, 46వ డివిజన్ అభ్యర్థి ప్యారీ బేగం 1232 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు నిన్నటి ఫలితాలు తేల్చి చెప్పాయి.
ఈ ఇద్దరు అభ్యర్థులు రెండు నెలల క్రితం మహమ్మారి బారిన పడి మృత్యవును ఆశ్రయించారు. దీంతో ఆ రెండు డివిజన్లకు ఉప ఎన్నిక తప్పని సరైంది.