‘గీతం’ ఉల్లంఘనలపై ఏఐసీటీఈ చైర్మన్‌కు లేఖ

విశాఖపట్నంలోని గీతం డీమ్డ్‌ యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలను నిర్మించడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించింది. Advertisement తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు…

విశాఖపట్నంలోని గీతం డీమ్డ్‌ యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలను నిర్మించడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించింది.

తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు పలు పత్రికలో వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో నిజాల నిగ్గు తేల్చేందుకు తక్షణమే గీతం నియమోల్లంఘనలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ సహస్రబుద్దేకు లేఖ రాశారు.

గీతం డీమ్డ్‌ యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాల నిర్మాణం, వివిధ ఇంజనీరింగ్‌ విభాగాలలో ఏటా పెంచుతూ పోతున్న సెక్షన్లకు సంబంధించి ఏఐసీటీఈ ఆమోదం పొందే విషయంలో పాల్పడిన వివిధ నియమోల్లంఘనలను విజయసాయి రెడ్డి తన లేఖలో సోదాహరణంగా వివరించారు.

ఏఐసీటీఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తూ గీతం విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించి అందులో మెకానికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిందని ఆయన ఆరోపించారు.

ఆ భవనాలు ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూమిలో నిర్మించిన విషయాన్ని దాచిపెట్టి గీతం ఏఐసీటీఐ నుంచి ఇంజనీరింగ్‌ కోర్సులకు అనుమతులు సంపాదించింది. తద్వారా ఏఐసీటీఈని గీతం యాజమాన్యం తప్పుదారి పట్టించింది.

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ద్వారా కేటగిరీ 1 గ్రేడ్‌తో స్వయంప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ హోదాను దక్కించుకున్న గీతం ఇలాంటి దురాక్రమణలకు పాల్పడి ప్రభుత్వ భూముల్లో అకడమిక్‌ భవనాలు నిర్మించడం అత్యంత శోచనీయమని ఆయన లేఖలో పేర్కొన్నారు.

భూమి అవసరాల నిబంధనకు తిలోదకాలు…

ఏఐసీటీఈ నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పాటించకుండా గీతం కొన్ని టెక్నికల్‌ కోర్సులు, ప్రోగ్రాములు పెట్టిందని ఆయన తెలిపారు. గీతం అధీనంలో ఉన్న కొంత భూమికి సంబంధించి యాజమాన్య హక్కులపై వివాదం నెలకొని ఉంది.

ఏఐసీటీఈ మార్గదర్శకాలకు ఇది పూర్తిగా విరుద్ధం. ప్రభుత్వానికి చెందిన భూమిలో మెకానికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిన గీతం విద్యా సంస్థ అడ్డదారుల్లో, మోసపూరితంగా సంబంధింత అధికారుల నుంచి భూ వినియోగం, భవనాల ప్లాన్‌లకు ఆమోదం పొందిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించగా 40 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం సంస్థ ఆక్రమించినట్లుగా నిర్ధారణ అయింది. ఆక్రమించిన భూమిపై స్వాధీన హక్కులు పొందేందుకు గడచిన కొన్నేళ్ళుగా గీతం యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ వస్తోంది.

అయితే ఇప్పటి వరకు కూడా ఆ 40 ఎకరాల 50 సెంట్ల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం గీతం విద్యా సంస్థలకు ఎలాంటి స్వాధీన హక్కులను ఇవ్వలేదు. అలాగే ఆక్రమిత భూమిని గీతంకు కనీసం లీజుకు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విభాగానికి చెందిన వెబ్‌సైట్‌లో తనిఖీ చేసి ఏఐసీటీఈ ఈ వాస్తవాలను ధృవీకరించుకోవచ్చని ఆయన తెలిపారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసీటీఈ అనుమతులు టెక్నికల్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నకొన్ని భవనాలు గీతం యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో నిర్మించినవే. కానీ ఏఐసీటీఈ అనుమతుల కోసం సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వాస్తవాలను ఆ విద్యా సంస్థ యాజమాన్యం దాచి పెట్టింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసీటీఈ అనుమతులు సంపాదించి ఇంజనీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ప్రతి ఏడాది అక్రమంగా అదనపు సెక్షన్లు…

గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌లో ప్రతి ఏడాది అదనపు సెక్షన్లను జోడిస్తూ సీట్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోయింద. ఉదాహరణకు బీ టెక్‌ సీఎస్‌ఈ విభాగంలో 20 సెక్షన్లు ఉన్నాయి.

2019-20 విద్యా సంవత్సరంలో ఒక్క సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే 1140 సీట్లను భర్తీ చేసింది. ఏఐటీసీఈ అప్రూవల్‌కు సంబంధించి వివరణ ఇస్తూ గీతం ఇటీవల ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర విద్యా శాఖ నిబంధనల ప్రకారం కేటగిరీ 1 విశ్వవిద్యాలయం యూజీసీ పరిధికి లోబడి మాత్రమే పని చేస్తుంది. కాబట్టి కొత్త కోర్సులు ఆరంభించడం పూర్తిగా తమ స్వేచ్ఛ, స్వాతంత్రం మేరకే జరుగుతుందని ప్రకటించింది. 

అలాంటప్పుడు గీతంలో ఇంజనీరింగ్‌ కోర్సులకు ఆమోదం జారీ చేయడానికి అవసరమైన సమాచారం పంపించాలని ఏఐసీటీఈ 2018 సెప్టెంబర్‌లో గీతం విద్యా సంస్థలకు లేఖ ఎందుకు రాయవలసి వచ్చింది.

ఇంజనీరింగ్‌ విభాగాలు, సెక్షన్ల ప్రారంభానికి అనుమతి పొందేందుకు ఏఐసీటీఐ రూపొందించిన విధివిధానాలు, నియమ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో సెక్షన్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న గీతం డీమ్డ్‌ యూనివర్శిటీకి నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అకడమిక్‌, మౌలికవసతుల సదుపాయాలు కల్పించే శక్తి ఉందో లేదో కూడా ఏఐసీటీఈ తనిఖీ చేయాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

భూమి అవసరాలకు సంబంధించి ఏఐసీటీఐ నియమ నిబంధనలకు అనుగుణంగా గీతం చర్యలు లేనందున ఇంజనీరింగ్ కోర్సుల ఆమోదం కోసం ఆ విద్యా సంస్థ గతంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌పై విచారణ జరిపి కొన్నిఇంజనీరింగ్‌ విభాగాల భవనాలు నిర్మించిన భూమి వివాదారహితమైనదో కాదో నిర్ధారించేందుకు తక్షణమే ఏఐసీటీఈ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

కంగ‌నాపై ముంబైలో ఒక కేసు