లేడీ అమితాబ్ మొక్కు ఏంటంటే…

లేడీ అమితాబ్, బీజేపీ మ‌హిళా నేత విజ‌య‌శాంతి కోరిక, అలాగే అమ్మ‌వారికి ఆమె మొక్కు ఏంటో తెలుసా? లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో సింహ వాహినీ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆమె మాట‌లు…

లేడీ అమితాబ్, బీజేపీ మ‌హిళా నేత విజ‌య‌శాంతి కోరిక, అలాగే అమ్మ‌వారికి ఆమె మొక్కు ఏంటో తెలుసా? లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో సింహ వాహినీ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆమె మాట‌లు వింటే తెలిసిపోతుంది.

కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు విజయశాంతి తెలిపారు. అలాగే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు విజయశాంతి వెల్ల‌డించారు. 

ఒక‌టేమో దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు, మ‌రొక‌టేమో పార్టీ అభ్యున్న‌తిని దృష్టిలో ఉంచుకుని అమ్మ‌వారి ముందు ఆమె రెండు ప్ర‌తిపాద‌న‌లు పెట్టిన‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు. అమ్మవారు చాలా శక్తిమంతమైంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఎప్ప‌టికీ ఉంటుందని ఆమె వెల్ల‌డించారు. 

సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. నియంత పాలనలో తెలంగాణ తల్లి నలిగిపోతోందని.. దీని నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి చేయాలని అమ్మవారిని కోరినట్లు విజ‌య‌శాంతి చెప్ప‌డం విశేషం. చివ‌రికి అమ్మ‌వారి వ‌ద్ద రాజ‌కీయ ప‌ర‌మైన కోరిక‌ల చిట్టాను కూడా పెట్ట‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య‌శాంతి కోరిక‌ల‌ను గ‌మ‌నిస్తే… కేసీఆర్ స‌ర్కార్‌పై ఆమె ఎంత అక్క‌సుతో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.