తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సెటైర్లు విసిరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌పై ఫేస్‌బుక్ వేదికగా విజయశాంతి ఘాటు విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మోసే వారికి కాకుండా మేయరు అనే వారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని అవాస్తవ ప్రకటనలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోందని విజయశాంతి వెటకరించారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ ఓటర్లు ఈసారి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు.
సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఇటీవల ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోందని విజయశాంతి చెప్పుకొచ్చారు. త్వరలో విజయశాంతి బీజేపీలో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఆమె ఖండించలేదు. మరోవైపు ఇటీవల కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచారు.