అధికారంలోకి వచ్చిన వెంటనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు. దీని కోసం గ్రామ సచివాలయాల్ని ఏర్పాటుచేశారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పటికే ఉన్న ఎన్నో సేవలతో పాటు నవరత్నాల అమలును కూడా క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు అప్పగించారు.
ఫలితంగా.. వాలంటీర్ వ్యవస్థపై పెనుభారం పడింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క వాలంటీర్ ప్రశాంతంగా లేడు. ఊపిరి సలపని పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ప్రభుత్వ పథకాల్ని లబ్దిదారుల ఇళ్లకు చేర్చడంతో పాటు వివిధ సర్వేల భారం కూడా వాలంటీర్లపై పడింది.
దీనికితోడు ఊహించని విధంగా వచ్చిన కరోనా, వాలంటీర్లపై భారాన్ని రెట్టింపు చేసింది. ఇంటింటి సర్వే చేపట్టడం, రోగుల్ని నిర్థారించడం, వాళ్ల బాగోగుల్ని ఆరా తీయడం.. ఇలా 24 గంటలు పనిచేశారు వాలంటీర్లు. ఇప్పుడు వీళ్లకు బియ్య డోర్ డెలివరీ పథకం మరింత అదనపు భారాన్ని తీసుకురాబోతోంది.
వచ్చేనెల నుంచి పేదల ఇంటికే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. దీని కోసం 9వేలకు పైగా వాహనాల కొనుగోలుకు టెండర్లు కూడా పిలిచింది. దీన్ని కూడా వాలంటీర్లకు అనుసంధానించే ఆలోచన చేస్తున్నారు. అదే కనుక జరిగితే రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లపై మరింత పనిభారం పడడం ఖాయం.
వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు మధ్య పని విభజన లోపించింది. క్షేత్రస్థాయిలో పని మొత్తం వాలంటీర్లపై పడింది. ఇంటింటికీ తిరిగేది వీళ్లే. సమాచారం సేకరించేది వీళ్లే. ఆ సమాచారాన్ని, కాస్త క్రోడీకరించి పై అధికారులకు పంపించడమే సచివాలయ ఉద్యోగుల పనిగా మారింది.
అటు జీతాల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో చాలామంది వాలంటీర్లు ఉద్యోగాలు మానేస్తున్నారు. మరికొంతమంది ప్రత్యామ్నాయం లేక ఇబ్బంది పడుతూ అదే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
ఓ మంచి వ్యవస్థను రూపొందించే క్రమంలో పని విభజన చాలా అవసరం. ఇది ఉద్యోగి సామర్థ్యాన్ని పెంచేలా, అతడు తీసుకున్న జీతానికి న్యాయం చేసేదిగా ఉండాలి. వాలంటీర్ల విషయానికొచ్చేసరికి ఇది లోపిస్తోంది. తక్షణం ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటికీ వాలంటీర్ల వ్యవస్థే వెన్నెముక. ఆ వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఒకసారి వాలంటీర్ల వ్యవస్థకు బీటలుపడితే ఇక ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కుంటుపడినట్టే. ఉన్నఫలంగా ఈ వ్యవస్థకు రిపేర్లు చేయకపోతే.. భవిష్యత్తులో వాలంటీర్ పోస్టులో చేరేందుకు యువత ముందుకురాకపోవచ్చు.