We Are Not With Amaravathi. Please Go Back…ఇది రాయలసీమ ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాల నినాదం. అమరావతి పరిరక్షణ కోసమని బస్సుయాత్ర చేపట్టి, రాయలసీమలో ప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వెనక్కి పోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే బాబు డిమాండ్‌కు వత్తాసు పలుకుతున్న ‘రాయలసీమ టీడీపీ నేతల్లారా మీరు ఎటు వైపో తేల్చుకోండి’ అని ఆ సంఘాలు పిలుపునిస్తున్నాయి.
అనంతపురంలో చంద్రబాబు ఆదివారం పర్యటించనున్న నేపథ్యంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ విద్యార్థి సమాఖ్యతో పాటు రాయలసీమ ప్రజాసంఘాలు శనివారం ఓ కరపత్రాన్ని విడుదల చేశాయి.
ఈ కరపత్రంలో ప్రధానంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉండగా, నాడు సీఎం చంద్రబాబు ఏకపక్షంగా, కనీస చర్చ లేకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆ సంఘాలు మండిపడ్డాయి. అంతేకాకుండా హైకోర్టును కూడా అమరావతిలోనే నెలకొల్పి శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఊరూరా హైకోర్టు ఏర్పాటు చేస్తారా అని విలేకరుల సమావేశంలో అవహేళనగా మాట్లాడి సీమపై వ్యతిరేకతను బహిరంగంగానే ప్రకటించి తమ ప్రాంత మనోభావాలను దెబ్బతీశాడని కరపత్రంలో రాయలసీమ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
అలాగే అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారని, తిరుపతిలో నిర్మించాల్సిన కేన్సర్ ఆస్పత్రిని అమరావతికి తరలించారని, జీఓ 120 జారీతో సీమ బిడ్డలు వైద్య విద్య చదవాలనే ఆకాంక్షలను చంద్రబాబు చిదిమేసినట్టు గుర్తు చేశారు.
తునిలో రైలును తగలబెట్టిన ఘటనలో ఏ మాత్రం సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ‘రాయలసీమ గూండాల పనే’ అని జన్మనిచ్చిన గడ్డపై విషం చిమ్మిన వైనాన్ని గుర్తు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో రాయలసీమ ఆకాంక్షలను గుర్తించని చంద్రబాబుకు గత సార్వత్రిక ఎన్నికల్లో సీమ వాసులు ముచ్చటగా మూడు సీట్లు మాత్రమే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకొని రాయలసీమకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకావాలని, రాయలసీమకు అక్కర్లేని అమరావతి రాజధాని కోసం వెనుకబడిన కరవు సీమను పావుగా వాడుకోవాలని తిరగడం దుర్మార్గమని తెలిపారు. అమరావతిని రాజధానిగా ఎప్పటికీ ఒప్పుకోని రాయలసీమ సమాజంలో యాత్రలు చేయడం అనైతికమని, అమరావతి కోసం యాత్రలు మాని సీమ కోసం మాట్లాడాలని, నిలబడాలని వారు కరపత్రం ద్వారా డిమాండ్ చేశారు.