కరోనా వార్తలతో చలి కాచుకుంటున్న మీడియా వారంలో ఒకటీ రెండు రోజులు మళ్లీ పెరిగిన కరోనా కేసులు అంటూ హడావుడి చేస్తూ ఉంది. రోజూ కరోనా కేసులు తగ్గుతున్నాయని చెబితే.. జనాలకు ఆసక్తి తగ్గిపోతుందనేది మీడియా లెక్క కాబోలు.
మళ్లీ కేసులు పెరుగుతున్నాయంటూ వారిలో భయాందోళనలు పెంచితేనే టీఆర్పీలు, క్లిక్కులు సొంతం అయ్యేట్టుగా ఉన్నాయి మీడియా వర్గాలకు. అందుకే.. వారంలో రెండు రోజుల పాటు పెరిగే కరోనా నంబర్లను హైలెట్ చేసి, మీడియా వర్గాలు చలి కాచుకుంటున్నాయి. మళ్లీ పెరుగుతున్న కేసులు.. అని చెబితే ఆ మజానే వేరే అన్నట్టుగా మీడియా వర్గాల వ్యవహరశైలి ఉంటోంది.
ఇంతకీ తగ్గుతున్న కరోనా కేసులు ఉన్నట్టుండి.. వారంలో ఒకటీ రెండు రోజుల పాటు ఎందుకు పెరుగుతున్నాయంటే.. అది కేవలం శాంపిల్స్ నంబర్ మీద మాత్రమే ఆధారపడి ఉండటంతో. కరోనా అనుమానితులు శాంపిల్స్ ఇవ్వడం, వైద్య వర్గాలు టెస్టులు నిర్వహించడం విషయంలో వారం రెండు రోజులు కాస్త యాక్టివిటీ తగ్గడంతో సోమ, మంగళ వారాల్లో వెల్లడయ్యే ఫలితాల్లో కొంచెం ఎక్కువ తగ్గుదల, బుధ- గురు వారాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య కాస్త పెరగడం జరుగుతూ ఉంది. దీనికంతా కారణం వీకెండ్!
ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. చాలా వరకూ కరోనా టెస్టుల రిజల్ట్స్ ను వెళ్లడించడానికి ప్రభుత్వ వైద్య వర్గాలు కనీసం రెండున్నర రోజులను తీసుకుంటున్నాయి. ఎవరైనా శాంపిల్ ఇచ్చారంటే.. 48 నుంచి 72 గంటల వ్యవధి మధ్యన అది పాజిటివ్ నా, నెగిటివ్ నా అని ప్రభుత్వ ల్యాబ్స్ లో తేలుతోంది.
అంటే.. ప్రతి రోజూ ఉదయం 8.30కు కేంద్రం విడుదల చేసే నంబర్లు.. సరిగ్గా అప్పటికి రెండున్నర రోజుల నుంచి మూడు రోజుల కిందట శాంపిల్స్ ఇచ్చిన వారివి! భారీ ఎత్తున శాంపిల్స్ ను పరీక్షించాల్సి రావడంతో.. ప్రభుత్వ ల్యాబ్స్ లో రిజల్ట్స్ కు ఆ మాత్రం సమయం తీసుకుంటోంది. దీన్ని పెద్దగా తప్పు పట్టడానికీ ఏమీ లేదు!
ఇక శని, ఆది వారాల్లో .. కరోనా అనుమానితులు టెస్టులు చేయించుకోవడానికి పెద్ద ఎత్తున వెళ్లడం లేదని తెలుస్తోంది. అన్నింటా అలవాటైన వీకెండ్ రిలాక్సేషన్ టెస్టులకు వెళ్లడానికి కూడా అలవాటుగా మారినట్టుగా ఉంది.
శనివారం శాంపిల్స్ ఇచ్చే వారి రిజల్ట్స్ సోమవారం వస్తాయి, ఆది వారం వారి రిజల్ట్స్ మంగళవారం వెల్లడి అవుతాయి. శని-ఆది వారాల్లో వచ్చే శాంపిల్సే తక్కువ కావడంతో.. వాటిల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే నమోదవుతుంది. దీంతో.. సోమ, మంగళవారాల్లో కేంద్రం విడుదల చేసే నంబర్ తక్కువగా నమోదవుతుంది.
ఇక సోమ, మంగళవారం జనాలు శాంపిల్స్ ఇవ్వడానికి క్యూలు కడతారు. దీంతో.. బుధ, గురు వారాల్లో వెల్లడయ్యే ఫలితాల్లో.. పెరుగుదల కనిపిస్తుంది. సెకెండ్ వేవ్ ట్రెండ్ ను అంతా గమనిస్తే సోమ, మంగళవారాల్లో కేసుల గ్రోత్ రేట్ తక్కువగా ఉండటం లేదా, కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదు కావడం, అదే బుధ, గురు వారాల్లో కేసుల సంఖ్యలో కచ్చితంగా పెరుగుదల నమోదు కావడాన్ని గమనించవచ్చు.
దీన్ని పట్టుకుని..కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోందని, ఉపశమనం ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ ఊపేస్తోందంటూ.. 24 గంటల టీవీ చానళ్లు, మీడియా అపర మేధావులు జనాలకు లేని కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయడంలో తమ ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారు. అసలు సంగతులు ఎందుకు.. కరోనా అంటూ ప్రజలను భయానికి గురి చేయడమే వార్తా చానళ్ల పని అయ్యింది.