సంక్షేమ పథకాలంటే ఓట్లు కొనుక్కోవడమే

సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం రాష్ట్రంలో దళితులు తప్ప ఎవరూ కనబడటంలేదు. ఈమధ్య దళితబంధు అనే పథకం ప్రకటించినప్పటినుంచి ప్రతిరోజూ దళితుల స్మరణే. ఇదంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావమని చెప్పకతప్పదు. ఉప ఎన్నిక…

సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం రాష్ట్రంలో దళితులు తప్ప ఎవరూ కనబడటంలేదు. ఈమధ్య దళితబంధు అనే పథకం ప్రకటించినప్పటినుంచి ప్రతిరోజూ దళితుల స్మరణే. ఇదంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావమని చెప్పకతప్పదు. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదుగాని కేసీఆర్ మాత్రం దళితబంధు గురించి ఊఫారగొట్టిపారేస్తున్నారు. చాలా అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు కూడా. 

ఇప్పటి ముఖ్యమంత్రులకు ఓ అలవాటు ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే దీన్ని అలవాటు అనడంకంటే ఇదో జబ్బు అంటే బాగుంటుంది. పస తక్కువ ప్రచారం ఎక్కువ అనే విధంగా వ్యవహరిస్తున్నారు తెలుగు ముఖ్యమంత్రులు. వాళ్ళు చేసే పని ఏమిటి? జనాలకు డబ్బులు పంచడం. సంక్షేమం ముసుగులో డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టడం.

ప్రజా ధనాన్ని పంచిపెట్టే పనికి ఎక్కడలేని బిల్డప్ ఇస్తుంటారు. సొంత మీడియాలో దానిపై భజన. ఇక మంత్రులు, అధికార పార్టీ నాయకులు సరేసరి. ఏ పథకం ప్రవేశపెట్టినా సరే ఇంత గొప్ప పథకం ప్రపంచంలోనే లేదని అతిశయోక్తిగా చెబుతుంటారు. ఈ పథకం వల్ల జీవితాలే మారిపోతాయంటారు. 

పాలకులు ప్రవేశపెట్టే పథకాలు సమాజం మొత్తానికి మేలు కలిగించేవి కాదు కదా. ఏ వర్గం నుంచి ఓట్లు వస్తాయని అనుకుంటారో ఆ వర్గం కోసమే పథకాలు అమలు చేస్తారు. ఇప్పుడు దళితబంధు పథకాన్ని గురించి సీఎం కేసీఆర్ చాలా గొప్పగా చెబుతున్నారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమని చెబుతున్నారు.

అసలు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇన్ని వర్గాలు, ఇన్ని కులాలు ఉన్నాయా? ఇలాంటి డబ్బులు పంచే దిక్కుమాలిన పథకాలు ఉన్నాయా? ఈ పథకంతో దళితుల పేదరికం పోగొడతాం అన్నారు కేసీఆర్. ఈ ఒక్క పథకంతో దళిత కుటుంబాల్లో పేదరికం పోయినట్లయితే ఇక ముందు వారికోసం ఏ పథకాలు ప్రవేశపెట్టకూడదు కదా. కానీ అలా జరగదు. మళ్ళీ ఎన్నికల ముందు ఇంకా యేవో పథకాలు ప్రకటిస్తారు. దళిత బంధు కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడట. జనాలకు ఇచ్చేది తన జేబులో డబ్బు కాదు కదా. ఎంతైనా ఖర్చు చేస్తాడు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు తెచ్చానని కేసీఆర్ బాజాప్తాగా చెప్పినప్పుడు ఇది ప్రపంచంలోనే గొప్ప పథకాన్ని చెప్పుకోవడం ఎందుకు? నిజంగా ప్రజలు బాగుపడాలని తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ అనుకుంటే వారికి ఉపాధి కల్పన దిశగా ఆలోచించాలి. 

డబ్బులు పంచితే దరిద్రం పోతుందని ముఖ్యమంత్రులు అనుకోవడం వారి భ్రమ. పేదరికం పోవాలని ఏ నాయకుడూ కోరుకోడు. నిజంగా పేదలు  బాగుపడితే నాయకులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు పంచే అవకాశం ఉండదు. ప్రభుత్వాలు పంచుతున్న డబ్బులతో ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి ? ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం డబ్బులు ఇస్తున్నదో ఆ లక్ష్యం నెరవేరుతుందా ? 

ఉదాహరణకు …ఏపీలో జగన్ అమ్మ ఒడి పేరుతో డబ్బులు పంచిపెట్టే పథకం పెట్టాడు. పేదలు తమ పిల్లలను బడికి పంపాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టాడు. ఈ డబ్బును నిజంగా పిల్లల కోసం ఉపయోగిస్తున్నారా? సారా దుకాణాల్లో ఖర్చు చేస్తున్నారా? అప్పులు తీర్చుకుంటున్నారా? ఎవరికీ తెలుసు. 

అనుకున్న పని కోసమే ఆ డబ్బు చేర్చు చేస్తున్నారని ఎలా నిర్ధారిస్తారు? ఇచ్చిన డబ్బులు దేనికో ఒకదానికి ఖర్చు పెట్టేసి మళ్ళీ సాయం కోసం చూస్తుంటారు. దళితబంధు డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తానని కేసీఆర్ అన్నారు. అది ఆయనకు సాధ్యమయ్యే పనేనా ? 

డబ్బులు  పంచే ఏ పథకమైనా ఎక్కువ శాతం దుర్వినియోగం కాక తప్పదు. ఈ పథకాలవల్ల ప్రజల్లో సోమరితనం పెరుగుతుంది. ఊరికే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే కష్ట పడటానికి ఇష్టపడతారా? ప్రజలకు ఉపాధి కల్పిచాలనే ఆలోచనను ప్రభుత్వాలు ఏనాడో మానేశాయి. 

ఎవరైనా కంపెనీలు పెట్టి కొంతమందికి ఉపాధి కల్పిస్తే దాన్ని ప్రభుత్వం తమ క్రెడిట్ గా ప్రచారం చేసుకుంటుంది. సంక్షేమ పథకాల గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే …ఓట్ల కోసం ప్రజలకు ముందుగానే డబ్బులు ఇవ్వడమన్నమాట. ఏ ముఖ్యమంత్రిదైనా ఇదే రూటు.