అనంతపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మాటలు వింటుంటే ఇంతకూ ఈయనకు ఏమైంది? ఏమవుతుందోననే భయం…ఆయన అభిమానుల్లో అంతకంతకూ పెరుగుతోంది. సహజంగానే కాస్తా నోటు దురుసు జేసీ బ్రదర్స్‌కు ఎక్కువే. సినిమాల్లో కమెడీయన్స్ కనిపిస్తే ప్రేక్షకులు నవ్వుకున్నట్టు….రాజకీయ రంగానికి వస్తే టీవీల్లో, సభల్లో జేసీ కనిపిస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి.
జేసీ దివాకర్‌రెడ్డి వారం క్రితం అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ దేశానికి ప్రాంతీయ పార్టీలు ఓ పీడలా తయారయ్యాయని విమర్శించాడు. రాజధానిలో టీడీపీ నేతలకు భూములున్నాయని ఆరోపించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తే బీజేపీలో చేరుతానని ప్రకటించాడు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జేపీ నడ్డాలను కూడా ఆయన కలిసి మంతనాలు జరిపాడు.
ఇప్పుడు అమరావతికి వెళ్లి రాజధాని రైతులకు మద్దతుగా మాట్లాడాడు. సంవత్సరంలోపు భారతి సీఎం కాబోతుందని వ్యాఖ్యానించాడు. అమరావతే రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని, దీన్ని రాజధాని కాదని చెప్పడానికి తాతలు దిగిరావాలన్నాడు. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించాడు.
అమరావతిలో కేవలం కమ్మ వాళ్లే భూములు కొనలేదని, విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారని చెప్పుకొచ్చాడు. ఒక కులంపై, వ్యక్తిపై ద్వేషంతో ఇలా చేయడం సరికాదని నీతి వాక్యాలు పలికాడు. రాజధానిని శ్మశానం అని మంత్రి బొత్స అన్నాడని, మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానమే అవుతుందని జేసీ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.
స్థలం, కాలం, మనుషులను బట్టి మాట్లాడటం జేసీకి అలవాటైందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబుకు భూములున్నాయని చెప్పిన జేసీ….తిరిగి అదే స్థలానికి వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండానే విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. వయస్సు పెరుగుతుండటం, సార్వత్రిక ఎన్నికల్లో వారసులిద్దరూ ఓటమి పాలు కావడం, మరో వైపు వ్యాపారాలు దెబ్బతినడం తదితర ప్రతికూల అంశాలు జేసీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. మున్ముందు ఆయన ఏం మాట్లాడుతారో, ఏమవుతారోనని ఆందోళన ఆయన దగ్గరి వాళ్లకు కలుగుతోంది.