కేసుల నమోదులో వైసీపీ సర్కార్ తారతమ్యాలు చూపుతోందా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమే వస్తోంది. దీనికి ఉదాహరణగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌నే ఉదహరిస్తున్నారు. మరి కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు రూ.50 లక్షలు సుపారీని మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్తతో ఒప్పందం కుదుర్చుకున్నామని నిందితులు చెప్పి వంద రోజులు గడుస్తున్నా….ఇంత వరకూ అతీగతీ లేకపోవడం ఏంటని? ఆళ్లగడ్డ వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
వైసీపీ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర్‌రావును గత నెల 29న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నాలుగో నిందితుడిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు ఉంది. కొల్లు రవీంద్ర పోలీసుల కళ్లు గప్పి పరారవుతుండగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు చిక్కాడు. భాస్కర్‌రావు హత్య కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు అభినందనీయం.
టీడీపీ నాయకుడు, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నాన్ని మార్చి 22న కడప పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా పట్టుబడిన నిందితులు వెల్లడించిన వివరాలు సంచలనం రేకెత్తించాయి. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు సొంత పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ రూ.50 లక్షలు సుపారీ ఇస్తామని చెప్పారు. అలాగే అడ్వాన్స్‌గా భార్గవ్‌రామ్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీను తమకు దాదాపు రూ.15 లక్షలు అందజేసినట్టు పోలీసుల విచారణలో పూసగుచ్చినట్టు చెప్పారు.
ఆ తర్వాత కొంత కాలానికి భార్గవ్‌రామ్ వ్యక్తిగత కార్యదర్శి, గుంటూరుకు చెందిన శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ నాలుగు, ఐదో నిందితులు. విచారణకు రావాలని భార్గవ్‌రామ్‌కు కడప పోలీసులు నోటీసులిచ్చారు. కానీ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్వయంగా భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మరోవైపు భార్గవ్‌రామ్ పోలీసుల నోటీసులను ఖాతరు చేయకుండా…విచారణకు హాజరు కాలేదని సమాచారం.
మరోవైపు తనపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన భూమా అఖిలప్రియ, ఆమె భర్తను అరెస్ట్ చేయాలని బాధితుడైన ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకుంటున్నాడు. అయినా పోలీసులు నిందితులకు సంకెళ్లు వేయడకుండా అడ్డుపడుతున్న అదృశ్య శక్తులేంటో అర్థం కావడం లేదు. మరోవైపు వైసీపీలో చేరుతాననే సంకేతాలను అఖిలప్రియ పంపడం వల్లే కేసు మూలన పడిందనే ప్రచారం కర్నూలు జిల్లాలో విస్తృతంగా సాగుతోంది.
అఖిలప్రియపై కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై కర్నూలు వైసీపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు అఖిలప్రియ పార్టీలోకి వస్తారనే ప్రచారం గంగుల వర్గానికి నిద్ర కరవు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడాలంటే ఏవీ సుబ్బారెడ్డి హత్యా యత్నం కేసులో పోలీసులు కృష్ణా జిల్లా పోలీసుల మార్గంలో నడవడం ఒక్కటే పరిష్కారం.