లోకేష్ సోషల్ మీడియా పేజీల్లో అతడి పోస్టులు గమనిస్తున్నారా? కొందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన పోస్టులు పెడుతున్నారు.. పనిలోపనిగా ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శ యాత్ర చేసి, ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి, ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి… మాయమైపోయారు లోకేష్. వస్తాడు, వస్తాడు అనుకుంటూనే దాదాపుగా 15 రోజులు గడిచిపోయాయి.
కనీసం ట్విట్టర్లో లోకేష్ లేటెస్ట్ ఫొటో ఒక్కటీ కనపడలేదు. ఎలాగూ ట్విట్టర్ హ్యాండిల్ ను మెయింటెన్ చేసేది బయటి వ్యక్తులే కాబట్టి.. లోకేష్ కు అంత తెలుగు రాదు కాబట్టి, ఆయన ట్వీట్లను లెక్కలోకి తీసుకోలేం. సో.. లోకేష్ ఏమైపోయారు, ఎక్కడికెళ్లిపోయారు.
లోకేష్ కు సంబంధించిన సమాచారం ఎక్కడా బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. పండగలకి, పబ్బాలకి కుటుంబ సభ్యులంతా కలసి ఫొటోలకు ఫోజులివ్వడం నారా వారి ఫ్యామిలీకి అలవాటే. జెండా పండగని కూడా వదిలిపెట్టకుండా తాత, కొడుకు, మనవడు.. అందరూ ఫొటోలు దిగి ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. అలాంటిది దీపావళి పండగను ఎందుకు మిస్ అయినట్టు. టీడీపీ ఆశాదీపం లోకేష్ ఏమైనట్టు?
సామాన్య ప్రజలనే కాదు, టీడీపీ కార్యకర్తలను కూడా ఆలోచనలో పడేస్తున్న ప్రశ్నలివి. ట్విట్టర్లో లోకేష్ ప్రజెన్స్ తెలుస్తుంది కానీ, అది ఆయన కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. తెలుగులో లోకేష్ పేరిట ఎవరో పెట్టిన ట్వీట్ కనిపిస్తోంది కానీ మనిషి కనపడ్డం లేదు. అంటే కచ్చితంగా లోకేష్ అజ్ఞాతవాసంలోనే ఉన్నట్టు లెక్క. వేర్ ఈజ్ లోకేష్?
కొడుకు అజ్ఞాతవాసం దేని కోసమో చెప్పాల్సింది కేవలం చంద్రబాబు ఒక్కరే. హైదరాబాద్ నుంచి సింగిల్ గా అమరావతి వచ్చి వెళ్లిపోతున్న బాబు.. కొడుకు విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. జోరుగా యాత్రలు చేసి టీడీపీ శ్రేణుల్ని కాస్త హుషారెత్తించిన చినబాబు నాలుగు రోజుల్లోనే అజ్ఞాతవాసంలోకి వెళ్లడం కాస్త విచిత్రమే.