‘‘ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు గర్జించారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ఘీంకరించారు. అసెంబ్లీ రద్దు చేయాలని హూంకరించారు. ఆయన చేసిన గర్జన, ఘీంకారం, హూంకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలలా మార్మోగు తున్నాయి. ఆంధ్రాజనం భారీ ఎత్తున ఉద్యమానికి సిద్ధమైపోతున్నారు. అల్టిమేటాన్ని పాటించకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పెన వెల్లువెత్తుతుంది ’’… ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వర్గం మీడియా వండివార్చుతున్న వార్తలు. అగ్గి రాజేయడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. సరే ఆ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విషయానికి వస్తే, నిన్నగాక మొన్న కొలువుదీరిన అసెంబ్లీని రద్దు చేయాల్సిన అంతటి ఉత్పాతం ఎందుకు ఏర్పడింది? ఎక్కడుంది.? అసలు ఎందుకు రాజీనామా చేయాలి? ఒక వేళ చేయాల్సి వస్తే ఎవరు రాజీనామా చేయాలి? దమ్ముండాల్సింది ఎవరికి? ఎవరి దమ్ముపై ఎవరు సవాల్ విసరాలి? ప్రజాభిప్రాయం కోరాలనుకుంటున్న చంద్రబాబా? పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్న జగనా?
2019లో ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాను మొదటి నుంచి చెబుతున్నట్లే అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడ్డ జగన్ పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల తీర్మానం చేశారు. దానిని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
గవర్నర్ సంతకంతో మూడు రాజధానులకు నిర్ణయం జరిగిపోయింది. తాను ఇచ్చిన హామీలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను కూడా తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అన్ని విధాలా పునాదులు వేస్తున్నారు. సరే, ఈ నిర్ణయంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు పెదవి విరుస్తున్నాయి. అది సరైన నిర్ణయం కాదని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని గగ్గోలు పెడుతున్నారు. మంచిదే .
చంద్రబాబు నాయుడుగారు సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి, 14 ఏళ్ళపాటు పాలన సాగించిన నేత. ఆయన చేస్తున్న ఆందోళనను కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆ మేరకు ఆయన ఉద్యమాన్ని నిర్మించాలి కదా? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సమాయత్తం కావాలి కదా? అని మనం ఆలోచిస్తాం. కానీ, ఆయన ఎప్పుడూ నేరుగా తలపడరు. ఆయనకు జలుబు చేస్తే, ఆ పక్కనున్న పవన్ కళ్యాణ్‌కో , ఈ పక్కనున్న సిపిఐ రామకృష్ణకో ఆవిరిపట్టిస్తాడు. అయితే ఈ పర్యాయం ‘‘దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి ’’ అంటూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న అధికార పార్టీకి ఆవిరి పట్టే ఎత్తులు వేస్తున్నారు. సవాల్ విసురుతున్నారు.
చంద్రబాబు అమరావతిలో ఏమో జరిగిపోతోందనే భ్రమ కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి తాను, తాను ఏర్పాటు చేసిన అమరావతే దిక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతి లేకపోతే, రాష్ట్రానికి ఉన్న సముద్ర తీరప్రాంతమంతా పొంగి రాష్ట్రాన్ని ముంచేస్తుందన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఎక్కడి అమరావతి అక్కడే ఉంటుందనే సత్యాన్ని మాత్రం దాచిపెడతారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని అస్సలు చెప్పరు.
పైగా అభివృద్ధి, పాలన అంతా కూడా అక్కడే ఆ మూడు గ్రామాలకే పరిమితం చేయాలని పరితపిస్తున్నాడు. అసెంబ్లీ రద్దు చేయమని అడుగుతాడే తప్ప, తాను తన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉద్యమాన్ని ముందుకు ఉరికిస్తాం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించే సాహసం మాత్రం చేయరు. రాజీనామాలపై ఎవరైనా నిలదీస్తే, అవసరమనుకుంటే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని చిలకపలుకులు పలుకుతారు.
కారణం, ఆయనకు తెలుసు. ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే, మళ్లీ ఆ సీట్లు కూడా వస్తాయో లేదోననే భయం. ఏ అమరావతినైతే చంద్రబాబు కోరుకుంటున్నారో… అక్కడే ఆయన తనయుడు లోకేష్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. కాబట్టే ఆయన రాజీనామాలపై చిలకపలుకులు పలుకుతున్నారు. కానీ, అసెంబ్లీ మాత్రం రద్దు చేయాలి. ఇది చంద్రబాబు గారి తీరు. ఏమంతటి ఉపద్రవం ముంచుకొచ్చిందని అసెంబ్లీని రద్దు చేయాలి.? ఎక్కడి అమరావతి అక్కడే ఉంది. కాకపోతే, అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
అదే ఆయనకు నచ్చడం లేదు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఆ మూడు గ్రామాల్లోనే ఆయన ప్రాణం ఉంది. రాష్ట్రమంతా ఏమైనా పర్వాలేదు. ‘‘ నేనూ…, నా మూడు గ్రామాలు’’ అనే సినిమాను రాంగోపాల్ వర్మ తరహాలో ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూడు గ్రామాల కోసం రాష్ట్ర త్యాగాన్ని కోరుతున్నారు. ఎంతైనా సీనియర్ రాజకీయ నాయకుడు కదా… ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి మరి.
పుత్తా యర్రంరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్