తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుతురు డాక్టర్ సునీత కడప ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాయడం రాజకీయ దుమారం రేపుతోంది. తన ఇంటి వద్ద మణికంఠారెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని, సదరు వ్యక్తి తన తండ్రి హత్య కేసులో ప్రధాన అనుమానితుడికి ముఖ్య అనుచరుడిగా ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. డాక్టర్ సునీత ఫిర్యాదు మేరకు వివేకా ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మణికంఠారెడ్డిని శనివారం పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో అనుమానిత వ్యక్తి మణికంఠారెడ్డిని విచారిస్తున్నారు. వివేకా ఇంటి వైపు వెళ్లాల్సిన అవసరం ఏంటి? విచారణలో అతను చెప్పే కారణాలపై నిజానిజాల కూపీ లాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసలీ మణికంఠారెడ్డి ఎవరనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది. పులివెందుల వాసుల నుంచి సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
మణికంఠారెడ్డి స్వస్థలం పులివెందుల. అతను వైసీపీ ముఖ్య నాయకుల వెంట తిరుగుతుంటాడు. ప్రధానంగా అతను ముఖ్య మంత్రి వైఎస్ జగన్ హాజరయ్యే సభలకు సంబంధించి స్టేజీ డిజైన్, అందంగా తీర్చిదిద్దడం, ఇతరత్రా పనులు చేస్తుంటాడని సమాచారం. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మొదటి నుంచి వెన్నంటి ఉండే ఓ వ్యక్తి చేస్తుంటాడు.
కానీ ఒక్క కడప మాత్రం అందుకు మినహాయింపని తెలిసింది. ఎందుకంటే ఆ పని మణికంఠారెడ్డే చేస్తాడని చెబుతున్నారు. అయితే స్వభావరీత్యా మణికంఠారెడ్డి సరదాగా, అందరితో కలుపుగోలుగా ఉంటాడని పులివెందుల వాసులు చెబుతు న్నారు.
తాజాగా అతనిపై రెక్కీ ఆరోపణలు రావడంతో పట్టణ వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అందరూ ముద్దుగా మణి అని పిలుచుకునే ఆ వ్యక్తి అలాంటి పనులు చేస్తాడంటే నమ్మశక్యంగా లేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతుండడం విశేషం. అయితే మణికంఠారెడ్డి వివేకా ఇంటి వద్ద తచ్చాడటానికి కారణాలేంటో పోలీసుల విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది.