కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశంలో వివిధ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కాస్త వాయిదా వేసి, మరీ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. దేశ వ్యాప్తంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలకూ, మూడు లోక్ సభ నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ ఒకటిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఆ తర్వాత నెల రోజుల్లో ఉప ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. వాస్తవానికి ఇవి ఇప్పటికే జరగాల్సిన బై పోల్సే. అయితే కరోనా పరిస్థితులు నిమ్మళించేంత వరకూ కాస్త వేచి చూద్దాం అనే ధోరణిలో సీఈసీ కాస్త వాయిదా వేసింది. లేకపోతే పశ్చిమ బెంగాల్ భవానీపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటే దేశంలోని అన్ని బై పోల్ సీట్లకూ పోలింగ్ జరగాల్సింది.
ఎలాగైతేనేం.. సీఈసీ ఈ బై పోల్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మరి సీఈసీ నింపాదిగా స్పందించినా.. ఇప్పటికీ ఉప ఎన్నిక జరగాల్సిన నియోజకవర్గాల్లో ఒకటైన హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలడం లేదు. ఈ అభ్యర్థిత్వం ఎంపిక కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బోలెడంత కసరత్తు చేసింది. అప్లికేషన్లను ఆహ్వానించింది. తీర్మానాలు జరిగాయి. అలాగే కమిటీ కూడా ఏర్పాటు అయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదట. దీంతో.. అభ్యర్థి ఎంపిక ఎక్కడి వరకూ వచ్చిందో హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులకు కూడా అంతుబట్టని పరిస్థితి.
ఇక్కడ నుంచి బీసీ కార్డును ప్రయోగించడానికి కాంగ్రెస్ వాళ్లు కొండా సురేఖను పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆమె స్థానిక రాలు కాదంటూ మరో వివాదం రేగిందట! మరి అధికార టీఆర్ఎస్ ను, దానికి ప్రత్యామ్నాయం తనేనంటున్న బీజేపీని ఢీ కొట్టగల స్థానిక నేత ఎవరో కాంగ్రెస్ వాళ్లు ఇంకా తేల్చుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు.
ప్రస్తుతానికి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణారెడ్డి అనే మూడు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరో ఒకరు ఫైనలైజ్ అవుతారా? లేక మూడు పేర్లూ పోయి, మరే పేరో తెర మీదకు వస్తుందా? అనేది ఇంకా శేష ప్రశ్నే!