తెలుగుదేశం పార్టీపై ఇంత వ్యతిరేకత ఎందుకు ప్రబలింది? సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యి.. రెండున్నరేళ్ల తర్వాత కూడా చంద్రబాబు మీద ఇంత కసి ఎందుకు ఉంది? తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ అంతలా చిత్తవ్వడం ఏమిటి? నెల్లూరు కార్పొరేషన్లో జీరో గా నిలవడం ఏమిటి? పెనుకొండ వంటి కంచుకోటలో రెండు వార్డులకు పరిమితం కావడం ఏమిటి? ఇవే కాదు.. ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన స్థానిక ఎన్నికలు, తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు.. వీటన్నింటిలోనూ టీడీపీ చిత్తుగా ఓడింది!
మరి జగన్ మోహన్ రెడ్డి ఎంతలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నా, అధికారంలో ఉన్న వారిపై ఎంతో కొంత వ్యతిరేకత రానే వస్తుంది. దానికి ఏ ఒక్కరూ అతీతులు కాదు. ఆ వ్యతిరేకత టీడీపీని గెలిపించకపోయినా.. కనీసం పరువు నిలిపే స్థాయిలో అయినా ఈ పాటికి చేరాల్సింది. నెల్లూరు వంటి కార్పొరేషన్లో టీడీపీ ఉనికి నిలుపుకోవాల్సింది, కుప్పంలో అయితే మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాల్సింది.
అది ప్రతిపక్షంగా టీడీపీ పనికి ప్రజల నుంచి దక్కిన కనీస గుర్తింపు అయ్యేది. అయితే.. అధికారంలో ఉన్న వారిపై ప్రబలాల్సిన వ్యతిరేకత చంద్రబాబుపై మరింత రెట్టింపు అవుతోంది! ఇప్పుడే కాదు.. ఏపీలో ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ ఉనికి చాటుకుంటుందనే నమ్మకం క్రమంగా ఆ పార్టీ క్యాడర్ లోనే నశిస్తోందంటే ఆశ్చర్యం కాదు!
మరి దీనికి ప్రధాన కారణాలు ఏమిటి? అంటే.. గట్టిగా వినిపించే మాట చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉండటం కూడా ఒకటి! మంచికో.. చెడుకో.. చంద్రబాబును ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారు. పాలించమని జగన్ కు అవకాశం ఇచ్చారు. అయితే… టీడీపీ జగన్ ప్రభుత్వ ప్రతి నిర్ణయం మీదా.. కోర్టును ఆశ్రయిస్తోంది. రకరకాల వ్యక్తులకు రకరకాల ముసుగులు వేస్తూ.. కోర్టుకు పంపుతోంది. ఆఖరికి ప్రభుత్వ విధానపరంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిపై కోర్టులో పిటిషన్ తప్పదు! మూడు రాజధానుల అంశం దగ్గర నుంచి.. మొదలుపెడితే, ఈ జాబితా చాంతాడంత అవుతుంది!
అలాగే టీడీపీ నేతలు ఏదైనా కేసుల్లో అరెస్టు అయితే.. సాయంత్రానికి బెయిల్ వస్తుంటుంది. లేదా వారు ఆసుపత్రిలో సేదతీరతారు! జగన్ ను బూతులు తిట్టిన టీడీపీ నేతకు సాయంత్రానికి బెయిల్, అదే సోషల్ మీడియా పోస్టుల మీద మాత్రం.. ఇంటర్ పోల్ వరకూ వ్యవహారం వెళుతున్న వైనాన్ని ప్రజలు గమనించడం లేదనుకోవడం భ్రమే అవుతుంది. ఇదంతా న్యాయమే కావొచ్చు. అయితే ప్రజలకూ ఒక న్యాయం ఉంటుంది!
సామాన్యుల్లో ఏపీ రాజకీయంపై ఉన్న బలమైన అభిప్రాయం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి, జగన్ కు అన్ని ఆటంకాలూ కల్పిస్తూ ఉన్నాడనేది. జగన్ చేయాలనుకున్న ఏ ఒక్క పనినీ చంద్రబాబు చేయనివ్వడు. దశాబ్దాల నుంచి వివిధ వ్యవస్థల్లోకి ఆయన తన మనుషులను జొప్పించి.. ఇలా చేయించగలుగుతున్నాడనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఇవి చెరిపితే చెరిగిపోయేలా లేవు కూడా!
అధికారంలో లేకపోయినా చంద్రబాబుపై ఇంత వ్యతిరేకత ఎందుకంటే ఈ వ్యవస్థలను మేనేజ్ చేసే ఫలితమే! అధికారం ఇచ్చినప్పుడు ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు కూడా ప్రజలు ఎంతో కొంత క్షమిస్తారేమో కానీ, తామే తిరస్కరించాకా కూడా.. అవే పోకడలకు పోతే మాత్రం క్షమాపణలు అనేవి శాశ్వతంగా ఉండవని ఏపీలోని వివిధ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.
అయితే ఈ కథ ఇప్పుడే అయిపోలేదు. రానున్న రెండేళ్లలో కూడా టీడీపీ పోకడలు మారవు. జగన్ చేయాలనుకున్న దానికి టీడీపీ తనదైన రీతిలో అడ్డుపడుతూనే ఉంటుంది. అందుకు ఇలాంటి పర్యవసనాలను అనుభవించాల్సి రావొచ్చు!