మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివెందుల పేరు నోట్లోనే ఉంటుంది. వైఎస్ కుటుంబంపై అక్కసుతో చివరికి పులివెందుల ప్రజల్ని కూడా కించపరచడానికి ఆయన ఏనాడూ వెనుకాడలేదు. ఇది భయంతోనా లేక మరే కారణంతోనా? అనేది తేలాలి. పులివెందులలో పులి అని ఉండడం వల్ల ఆయన అక్కడి ప్రజలందర్నీ పులులని భావిస్తున్నారా? అయినా పులివెందుల అంటే బాబుకు ఎందుకంత భయం?
రాయలసీమ వాసైన చంద్రబాబునాయుడు తన సమీప జిల్లాలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై అవాకులు చెవాకులు పేలడం ఇదే మొదటిసారి కాదు.
పులివెందుల, కడప, ఆ తర్వాత రాయలసీమ అంటూ అనేకమార్లు విషం కక్కిన చంద్రబాబుకు … గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజల ముచ్చటగా మూడు సీట్లే కట్టబెట్టి తగిన బుద్ధి చెప్పారు. అయినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా, మరింత ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు.
తాజాగా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో ఆయన జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పాన్ని మరో పులివెందుల చేయాలనుకుంటున్నారని విషం కక్కారు.
శాంతియుతంగా ఉండే కుప్పం నియోజకవర్గ ప్రజలపై రౌడీయిజం చేసి భయభ్రాంతులకి గురి చేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేసిన ఓ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా?
అసలు పులివెందుల అంటే చంద్రబాబుకు ఏమీ తెలిసినట్టు లేదు. పులివెందుల అంటే బాబు దృష్టిలో రౌడీలకు నిలయమనే భావన ఉన్నట్టుంది. అందుకే ఆయన పదేపదే నిందారోపణలు చేస్తుంటారు.
రాజకీయ, సినీ, సాహిత్యరంగంలోని ఉద్ధండులకు పులివెందుల గడ్డ అడ్డా అనే విషయం బాబుకు తెలిసినట్టు లేదు. తన రాజకీయ ప్రత్యర్థులకు ఓటమి ఎరుగని నియోజకవర్గంగా ప్రజలు ఆదరించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారు.
దివంగత వైఎస్ హయాంలో జేఎన్‌టీయూ కాలేజీ, అలాగే పులివెందుల పశుగణాభివృద్ధి పరిశోధన సంస్థ, పైడిపాళెం ప్రాజెక్టు, లింగాల కుడికాలువ తీసుకొచ్చారు. ఇప్పుడు పులివెందులకు నీళ్లిచ్చానని పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు … ఆ నీళ్లను గాలిలో తీసుకొచ్చారా? వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్లే బాబు నీళ్లు ఇవ్వగలిగారు.
అలాగే లింగాల కుడి కాలువ ఏర్పాటు చేయడం వల్ల పులివెందుల నియోజకవర్గంలో 8 చెరువులను నింపగలిగే పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా రెండు, మూడు పంటలను పండించుకునే అవకాశం దివంగత వైఎస్ ముందు చూపు వల్ల కలిగింది.
ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి, అలాగే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ముద్దనూరు సమీపంలో 20 టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్ట్ రూపకల్పనకు జగన్ శ్రీకారం చుట్టారు. తద్వారా చిత్తూరు జిల్లా వరకు నీళ్లను తీసుకెళ్లే అవకాశం ఉంది. కుప్పాన్ని పులివెందుల చేయడం అంటే ఏ కోణంలో చూడాలో చంద్రబాబే సెలవివ్వాలి.
మరి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పానికి చేసిన అభివృద్ధి ఏంటో చంద్రబాబే సెలవివ్వాలి. ఇప్పటికైనా పులివెందులను కించపరిచేలా మాట్లాడ్డం మాని, రాయలసీమ మనోభావాలను గౌరవిస్తే ఆయనకే మంచిది.