రెండు రోజుల క్రితం రాజధాని రైతులతో జనసేనాని పవన్ సమావేశమైనప్పుడు వీరావేశంతో మాట్లాడాడు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని తేల్చి చెప్పాడు. ‘రేపు ఢిల్లీకి వెళుతున్నా. ఇక్కడి సమస్యలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళుతా. అసలు అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామనే ఒప్పందంతోనే నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా. ఢిల్లీకి వెళ్లి రాజధానిపై భరోసా కల్పిస్తా’ అని ఎంతో ధీమాగా చెప్పాడు.
పవన్ చెప్పినట్టే నిన్న ఢిల్లీ వెళ్లాడు. కేంద్ర పెద్దల్ని కలిశాడు. ఏపీకి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి తదితర నేతలతో కలసి ఆయన కేంద్రమంత్రి నిర్మలాసీతారామ్‌తో కలిశారు. రాష్ట్ర విషయాలపై చర్చించారు. అలాగే ఏపీలో రాజధాని అంశంపై బీజేపీ అగ్రనేతలతో చర్చించాడు. అనంతరం పవన్ విలేకరులతో మాట్లాడాడు. రాజధాని అంశంపై కేంద్రం పరిధిలో కాదని తేల్చి చెప్పాడు. ఆ మాటతో రాజధానిపై పవన్ భరోసా తుస్సుమంది.
విలేకరుల సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ నిన్న అప్పటికప్పుడు అనుకుని ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని, అందువల్ల పవన్‌కు కూడా తక్కువ సమయం ఉండిందన్నాడు. ఇక్కడో విషయాన్ని ప్రధానంగా గమనించాలి. జీవీఎల్ రెండుమూడు రోజులుగా వరుసగా ప్రధాన చానళ్లలో మాట్లాడుతూ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉంటుందని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. అలాగే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ ఓ వాదనను ముందుకు తెస్తూ తమ పార్టీని దోషిగా నిలబెట్టాలనుకుంటోందని విమర్శించాడు. ఎట్ట పరిస్థితుల్లోనే రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ చెబుతూ వస్తున్నాడు.
కానీ ఇటీవల తమతో పొత్తు పెట్టుకున్న పవన్ అందుకు విరుద్ధంగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని, కేంద్రంతో మాట్లాడుతానని చెబుతుండటంతో ఏపీలో అయోమయం నెలకొంది. ఒకవేళ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోతే ఆ చెడ్డ పేరు బీజేపీకి వస్తుందనే భయంతో పవన్‌కు వాస్తవాలు చెప్పేందుకు బీజేపీ అధిష్టానం పిలిపించినట్టు సమాచారం. కేంద్రం హక్కులేమిటో పవన్‌కు అవగాహన కల్పించినట్టు తెలిసింది.
అందుకే సమావేశానంతరం రాజధాని కేంద్రం పరిధిలోనిది కాదని పవన్ స్పష్టం చేశాడు. కాకపోతే క్షేత్రస్థాయిలో రాజధాని కోసం ఉద్యమాలు మాత్రం చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. అమరావతి రైతులకు గొప్పలు చెప్పి ఢిల్లీ వెళ్లిన పవన్….తీరా అక్కడి నుంచి తీపి కబురు మోసుకొస్తాడనుకుంటే చావు కబురు చల్లగా చెప్పాడని రాజధాని రైతులు అంటున్నారు.