మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని తానెందుకు చంపుతానని …హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్రగంగిరెడ్డి అన్నాడు. ‘ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరుకుతా’ అంటూ ఎర్రగంగిరెడ్డి తనను బెదిరించాడని వివేకా ఇంటి కాపలాదారుడు రంగన్న అలియాస్ రంగయ్య చెప్పడం తీవ్ర దుమారం రేపింది.
అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదని రంగయ్య అన్నాడు. సీబీఐ అధికారుల భరోసాతో జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన పులివెందులకు చేరుకున్నాడు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పావని స్థానికులు, విలేకరులు అడగ్గా తనకు భయమేస్తోందని అతను అన్నాడు. కానీ భయపడాల్సిన పని లేదని అక్కడున్న వారు చెప్పగా, వారి చెవిలో ఎర్రగంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుమార్ పేర్లను చెప్పినట్టు వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎర్రగంగిరెడ్డి మీడియాకు వివరణ ఇచ్చాడు.
తనపై ఆరోపణలు చేసిన రంగన్న ఎవరో తనకు తెలియదన్నాడు. అతనితో తనకు పరిచయమే లేదన్నాడు. రంగన్నను బెదిరించలేదని ఎర్రగంగిరెడ్డి చెప్పుకొచ్చాడు. తాను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు నమోదు కాలేదన్నాడు.
వివేకా తనను ఎంతో బాగా చూసుకున్నాడని, అలాంటప్పుడు ఆయన్ను తానెందుకు చంపుతానని ఎర్రగంగిరెడ్డి ప్రశ్నించడం గమనార్హం. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కానే కాదన్నాడు. వివేకా హత్యలో తన ప్రమేయమే లేదని ఎర్రగంగిరెడ్డి తేల్చి చెప్పాడు.