కామ వాంఛతో ఓ మహిళ చేసిన పని మొత్తంగా ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది. ఐదేళ్ల పాప హత్యకు గురవ్వగా.. అవమానం భరించలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోనే ఘట్ కేసర్ లో జరిగింది ఈ ఘటన.
భువనగిరికి చెందిన కల్యాణ్ రావు 2012లో అనంతపురానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఘట్ కేసర్ లోని ఐకే గూడలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీళ్లకు ఐదేళ్ల పాప ఉంది. ఉద్యోగం పనిమీద భర్త బయటకు వెళ్లడంతో ఖాళీగా ఉన్న భార్య, ఫేస్ బుక్ లో కరుణాకరన్ తో పరిచయం పెంచుకుంది.
మహిళకు బాగా దగ్గరైన కరుణాకర్ ఇంటికి కూడా వచ్చేవాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ రాజశేఖర్ ను కూడా సదరు మహిళకు పరిచయం చేశాడు. అయితే ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. కరుణాకర్ ను పక్కనపెట్టి, సదరు మహిళ, రాజశేఖర్ ఒకటయ్యారు. అక్రమ సంబంధానికి తెరతీశారు.
విషయం తెలుసుకున్న కరుణాకర్, ఓ రోజు వీళ్ల అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అదే టైమ్ లో రాజశేఖర్ తప్పించుకోవడంతో.. ఆవేశంతో అక్కడే ఉన్న పాపను చంపేశాడు కరుణాకర్. ఆ వెంటనే తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరుణాకర్ ను హాస్పిటల్ చేర్పించిన పోలీసులు.. కేసు నమోదుచేసి మహిళను విచారించారు.
అప్పటివరకు ఏం జరుగుతుందో కూడా అర్థంకాని భర్త కల్యాణ్ రావు విషయం మొత్తం తెలుసుకొని మనస్థాపానికి గురయ్యాడు. భువనగరి రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ అక్రమ సంబంధం ఇలా ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల్ని బలితీసుకుంది.