కామాతురానాం న భయం, న లజ్జ అంటారు. ఇది అలాంటి వ్యవహారమే. కన్న కూతురుకి పెళ్లి చేసిన ఓ మహిళ, అల్లుడితో ఎఫైర్ పెట్టుకుంది. అక్కడితో ఆగలేదు ఈ బాగోతం. అల్లుడితో పడక సుఖం కోసం ఏకంగా భర్తను చంపేసింది. కామంతో కళ్లుమూసుకుపోయి చేసిన ఈ అకృత్యానికి ఫలితంగా ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన.
ఐరాల మండలం రంగయ్య చెరువుకు చెందిన మంజులకు రాణి అనే కూతురు ఉంది. పెళ్లీడుకొచ్చిన రాణికి పక్క మండలానికి చెందిన సుబ్రమణ్యానికి ఇచ్చి పెళ్లి చేసింది మంజుల. అయితే పెళ్లయిన 10 రోజులకే సుబ్రమణ్యంపై కన్నేసింది. అల్లుడ్ని లైన్లో పెట్టి మూడేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
అయితే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు దాగవు కదా. భర్తకు కొద్దిగా ఉప్పందింది. భార్యను అదుపులో పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో అల్లుడ్ని కలవడం మంజులకు కష్టంగా మారింది. ఓ రోజు కూతురు-అల్లుడ్ని చూసి వస్తానంటూ వాళ్లు ఇంటికి వెళ్లింది మంజుల. అక్కకే భర్తను చంపేయాలని అల్లుడితో చెప్పింది. అందుకు అల్లుడు సుబ్రమణ్యం కూడా సరే అన్నాడు.
మంజుల తన భర్తను తీసుకొని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అల్లుడితో కలిసి భర్తకు పూటుగా మద్యం పట్టించింది. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలు, రాళ్లతో కొట్టి అతడ్ని చంపేసి, దగ్గర్లోని కాలువలో పడేశారు.
నీటిపై తేలుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో మంజుల, సుబ్రమణ్యం నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ఇద్దరూ చెరో జైలులో రిమాండ్ లో ఉన్నారు.