కోర్టులు ఒక్కోసారి చాలా మంచి తీర్పులు ఇస్తుంటాయి. నిజంగా ఈ తీర్పులు సరిగా అమలు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అది అంత సులభంగా అయ్యే పనికాదు. ముఖ్యమంత్రి హామీ ఇస్తే ప్రభుత్వం దాన్ని అమలు చేసి తీరాల్సిందే అంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది కదా. వాస్తవానికి దీనిపై దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరగాల్సింది ఉంది.
ఒకవేళ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్ సర్కారు సుప్రీం కోర్టుకు వెళితే సుప్రీం కోర్టు ఈ తీర్పును సమర్ధిస్తుందా? మరోరకం తీర్పు ఇస్తుందా? సవరణలు చేస్తుందా? తెలియదు. దేశవ్యాప్తంగా ఈ తీర్పు ప్రభావం ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం. ఏది ఏమైనా ఢిల్లీ హై కోర్టు సంచలనాత్మకమైన తీర్పు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇది కోర్టు తీర్పు కాబట్టి, చట్టం కాదు కాబట్టి రాజకీయ నాయకులు అంటే ముఖ్యమంత్రులు భయపడతారని అనుకోలేము.
ముఖ్యమంత్రులు ఎడాపెడా హామీలు ఇవ్వడం, ఆ తరువాత తుంగలో తొక్కడం చాలా మామూలు విషయం. ఇందుకు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనే ఉదాహరణగా తీసుకోవచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రులు, వారి భజనపరులు అంటే మంత్రులు తాము చెప్పిన పనులే కాకుండా చెప్పని పనులు కూడా చేశామని అంటూ ఉంటారు. రాజకీయాలతో సంబంధం లేని సాధారణ ప్రజలు నిజమే కాబోలుననుకుంటారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే పూర్తిగా అమలు చేయని ముఖ్యమంత్రులు హామీ ఇవ్వని పనులు కూడా చేస్తారా ?
ఒకవేళ అలా చేసిన పనులేమైనా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉండదు. ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలోనే విపరీతంగా హామీలు ఇచ్చేస్తుంది. ఆ సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిష్టితి గురించి ఆలోచించరు. ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుందా అని ఆలోచించరు. ముందు అధికారంలోకి వస్తే చాలని అనుకుంటారు. అధికారంలోకి వచ్చాక ఆలోచించవచ్చులే అనుకుంటారు. అధికారంలోకి వచ్చాక అసలు విషయం అర్ధమవుతుంది.
ఎన్నికల సమయంలో వందల హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక యేవో సభల్లో, కార్యక్రమాల్లో మళ్ళీ హామీలు ఇస్తారు. అన్ని కలిపి తడిసి మోపెడవుతుంది. నెరవేర్చని హామీల గురించి ప్రతిపక్షాలు నిలదీస్తే, విమర్శలు చేస్తే కొన్ని హామీల విషయంలో ఏ జవాబు చెప్పకుండా గమ్మున ఉంటారు. కొన్ని హామీలకు యేవో పనికిమాలిన కారణాలు చెబుతారు పాలకులు. కొన్నిటికి సరిగా జవాబు చెప్పలేక గతంలోని ప్రభుత్వం మీద తోసేస్తారు. ఎక్కువ మంది ఈ పనే చేస్తారు. పాలకులు ఒక హామీ ఇచ్చాక దాన్ని తప్పనిసరిగా అమలుచేయాల్సి వస్తే రకరకాల దిక్కుమాలిన నిబంధనలు పెడతారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలోగానీ, అధికారంలోకి వచ్చాకగానీ అలవిగాని హామీలు చాలా ఇచ్చారు. వాటిల్లో కొన్ని అమలు చేయలేకపోయారు. అలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. అయితే ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలంటూ ప్రజలు కోర్టులకు వెళితే కోర్టులకు వేరే కేసులు విచారించే అవకాశమే ఉండదు.
ఏళ్ళ తరబడి నెరవేర్చని హామీలపై విచారించే కేసులే సరిపోతాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జనం సంతోషిస్తున్నారుగానీ నెరవేర్చని ఎన్ని హామీల మీద కోర్టుల ద్వారా పోరాటం చేయగలరు?