ఇల్ల‌రికపు అల్లునికి మ‌ర్యాదేది అధ్య‌క్షా…

నారా చంద్ర‌బాబునాయుడు ….ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర పుట‌ల్లో త‌న‌కంటూ కొన్ని పేజీల‌ను కేటాయించుకున్న వ్య‌క్తి. మంచీచెడుల విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే, ఆయ‌న ప్ర‌స్తావ‌న లేని తెలుగు స‌మాజ రాజ‌కీయాల‌ను చ‌ర్చించుకోలేం. రాజ‌కీయాల్లో , పాల‌న‌లో…

నారా చంద్ర‌బాబునాయుడు ….ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర పుట‌ల్లో త‌న‌కంటూ కొన్ని పేజీల‌ను కేటాయించుకున్న వ్య‌క్తి. మంచీచెడుల విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే, ఆయ‌న ప్ర‌స్తావ‌న లేని తెలుగు స‌మాజ రాజ‌కీయాల‌ను చ‌ర్చించుకోలేం. రాజ‌కీయాల్లో , పాల‌న‌లో అనేక మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన హైటెక్ నేత‌గా చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. 

చంద్ర‌బాబంటే తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల దిట్ట అని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తుంటారు. కానీ అది ఒక ర‌కంగా ఆయ‌న‌కు ప్ర‌శంసే. రాజ‌కీయాలంటే ఎత్తులు పైఎత్తులే. బాబు మాదిరిగా రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చించ‌డంలో చాలా మంది నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు.

చివ‌రికి చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీయంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స‌క్సెస్ సాధించారే గానీ, మిగిలిన విష‌యాల్లో చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారనే వాద‌న లేక‌పోలేదు. ఇదే సంగ‌తిని నిన్న‌టికి నిన్న చంద్ర‌బాబు కూడా ప‌రోక్షంగా చెప్ప‌డం విన్నాం. కానీ తండ్రి వైఎస్సార్ చేయ‌లేనిది, చేత‌గానిదాన్ని ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ చేసి చూపించారు. రాజ‌కీయాల్లో జ‌గ‌న్ ఆడుతున్న మైండ్ గేమ్ ముందు చంద్ర‌బాబు నిల‌వ‌లేక‌పోతున్నారు.

అంత సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబును అసెంబ్లీలో తీవ్ర అస‌హ‌నానికి గురి అయ్యేలా చేసి, ఆయ‌న‌తో అన‌రాని మాట‌ల‌ను అనిపించి, అప్రతిష్ట పాలు చేయ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. బాబు త‌న కంటిని త‌న వేళ్ల‌తోనే పొడుచుకునేలా జ‌గ‌న్ రాజ‌కీయ  ర‌చించిన వ్యూహం చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిం ద‌ని చెప్పొచ్చు.

గ‌తంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లకు ఆయన సామాజిక వ‌ర్గం నేత‌ల‌నే చంద్ర‌బాబు ఉసిగొల్పారు. ఇప్పుడు అదే విద్య‌ను అంత‌కంటే ప‌క‌డ్బందీగా జ‌గ‌న్ ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై ముఖ్యంగా త‌న అత్త‌గారి జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, అది కూడా సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన  మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ, వ‌సంత‌ కృష్ణ‌ప్ర‌సాద్ దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

దిగంత నంద‌మూరి తార‌క‌రామారావు స్వ‌స్థ‌లం కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌కవ‌ర్గంలోని నిమ్మ‌కూరు. ఎన్టీఆర్ కూతురు భువ‌నేశ్వ‌రిని రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లె నివాసి చంద్ర‌బాబునాయుడు వివాహ‌మాడారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు రాయ‌ల‌సీమ అంటే ప్ర‌త్యేక అభిమానం ఉండేది. 

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి రోజుల్లో ఆయ‌న చిత్తూరు జిల్లా తిరుప‌తి, అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌కవ‌ర్గాల నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. ఆయ‌న చ‌నిపోయే నాటికి హిందూపురం ఎమ్మెల్యే. ప్ర‌స్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

స‌హ‌జంగా బామ్మ‌ర్దులు బ‌తుకు కోరుతారు, దాయాదులు చావు కోరుతార‌నే సామెత ఉంది. కానీ చంద్ర‌బాబు విష‌యంలో ఎందుకనో ఆ సామెత రివ‌ర్స్ అయింది. తాను పుట్టి పెరిగిన రాయ‌ల‌సీమ కంటే, కోస్తా ఇల్ల‌రిక‌పు అల్లుడిగా చెప్పుకోడానికే చంద్ర‌బాబు ఇష్ట‌ప‌డుతుంటారు. 

అందుకే ఆయ‌న రాజ‌ధానిని కూడా త‌న అత్తారింటికి తీసుకెళ్లారు. అలాంటి మంచి బావ‌పై కృష్ణా జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు ప‌దేప‌దే ఒంటి కాలిపై లేస్తుండ‌డం చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది.

నిన్న‌టికి నిన్న చంద్ర‌బాబును మంత్రి కొడాలి నాని ఎన్నెన్ని తిట్టు తిట్టారో తెలిసిందే. బాబుకు కొడుకుగా పుట్టినందుకు లోకేశ్‌, జ‌న్మ‌నిచ్చినందుకు  క‌ర్జూర‌పునాయుడు కూడా తిట్లు తినాల్సి వ‌చ్చింది. 

పోల‌వ‌రం ఎత్తును ప‌ప్పు… ప‌ప్పు తాత ల‌వంగంనాయుడు వెళ్లి కొలిచారా అని నిల‌దీశారు. ఇల్ల‌రికంలో భలే మ‌జా ఉంటుంద‌ని విన్నాం. కానీ ఇల్ల‌రికంలో ఇంత హింస ఉంటుంద‌ని ఇప్పుడు బాబుపై తిట్లు చూస్తుంటేనే తెలుస్తోంది గురూ! ఇల్ల‌రిక‌పై అల్లుడికి కృష్ణా జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు ఇచ్చే మ‌ర్యాద ఇదేనా అధ్య‌క్షా?