లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చల్లని చూపు కోసమేనా వైసీపీ ఎంపీల ఈ పడరాని పాట్లు? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల తిరుపతి పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అక్కడికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, డాక్టర్ గురుమూర్తి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఆయనకు విమానాశ్రయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఎంపీలు స్వాగత ఏర్పాట్లు చేశారు.
రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలికారు. అలాగే విద్యార్థినుల నృత్య ప్రదర్శనతో ఆయన మనసును చూరగొనే ప్రయత్నం చేశారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మవాతి అమ్మవారిని దర్శించుకున్నారు.
మంగళవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, డాక్టర్ గురుమూర్తితో పాటు మర్గాని భరత్ కూడా ఉండి మరీ దర్శనాన్ని దగ్గరుండి చేయించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాదిన్నరగా వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు పదేపదే విన్నవించుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా రఘురామపై వేటు వేసే వరకూ పోరాటాన్ని విరమించేది లేదనే రీతిలో స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు వెంబడిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీవారి దంపతుల దర్శనార్థం కుటుంబ సమేతంగా వస్తున్న స్పీకర్‌ను మంచి చేసుకునే క్రమంలో వైసీపీ ఎంపీలు ఆయన వెన్నంటే ఉన్నారనే చర్చ తిరుపతిలో నడుస్తోంది. ఈ క్రమంలో ఎంత మాత్రం సక్సెస్ అయ్యారో… ఫలితం మాత్రమే చెప్పాల్సి వుంది.