పార్టీ మార్పుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌ క్లారిటీ

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పి.రామ‌సుబ్బారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి పీఆర్ …. తిరిగి పాత గూటికే చేరుతార‌ని కొంత కాలంగా మీడియాలో…

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పి.రామ‌సుబ్బారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి పీఆర్ …. తిరిగి పాత గూటికే చేరుతార‌ని కొంత కాలంగా మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఆయ‌న మీడియా ముందుకొచ్చి త‌న వైఖ‌రిని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పార్టీ మారుతున్న‌ట్టు త‌న‌పై మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు.

ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంపై పూర్తి విశ్వాసంతోనే పార్టీలో చేరాన‌న్నారు. వైసీపీలో త‌మ‌ను అంద‌రూ గౌర‌విస్తున్న‌ట్టు చెప్పారు. అంద‌రం క‌లిసి పార్టీ కోసం ప‌ని చేస్తామ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. 

గ‌తంలో కూడా త‌మ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా … ఆ పార్టీ ఆదేశాల మేర‌కు న‌డుచుకునే వాళ్ల‌మ‌న్నారు. ప్ర‌స్తుతం త‌న‌కు పార్టీ మారే అవ‌స‌రం లేద‌ని, రాజ‌కీయాల్లో ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్ వెంటే న‌డుస్తాన‌ని రామ‌సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు.

కాగా మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి రాక‌ను జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మొద‌ట్లో అంగీక‌రించ‌లేదు. పార్టీకి రామ‌సు బ్బారెడ్డి అవ‌స‌రం ఎంత మాత్రం లేద‌ని అధిష్టానానికి ఎమ్మెల్యే చెప్పిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. 

కానీ రామ‌సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న మంచి పేరు దృష్ట్యా , ఆయ‌న రాక‌తో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని భావించి వైసీపీలో చేర్చుకున్నారు. కానీ రామసుబ్బారెడ్డితో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలు జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో లేక‌పోలేదు.

మ‌రోవైపు మాజీ మంత్రి ఆదినారాయ‌ణరెడ్డి బీజేపీలో చేరిపోవ‌డంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క వ‌ర్గంలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. 

ఈ నేప‌థ్యంలో రామ‌సుబ్బారెడ్డి తిరిగి టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం బ‌ల‌ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో పార్టీ మారే ప్ర‌సక్తే లేద‌ని రామ‌సుబ్బారెడ్డి తేల్చి చెప్పి …అలాంటి ప్ర‌చారానికి చెక్ పెట్టిన‌ట్టైంది.

చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా?