కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామాను ప్రకటించారు యడియూరప్ప. భావోద్వేగపూరితంగా మారి, కన్నీరు పెట్టుకుంటూ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్న విషయాన్ని ప్రకటించారు.
గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో గత కొన్ని వారాలుగా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సంధిగ్ధత కొంత వరకూ తొలగిపోయింది. తన రాజీనామాను ఎవ్వరూ అడగటం లేదని కొన్నాళ్ల కిందట ప్రకటించిన ఈ 78 యేళ్ల నేత, అధిష్టానం కోరితే రాజీనామాకు రెడీ అని ఇటీవల ప్రకటించి, ఇప్పుడు ఆ మేరకు రాజీనామా చేశారు.
పలు సందర్భాల్లో భావోద్వేగమైపోయి కన్నీరు పెట్టుకోవడం యడియూరప్ప కు అలవాటు. ఇది వరకూ జేడీఎస్ మద్దతు ఉపసంహరణతో తొలిసారి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినప్పుడు యడియూరప్ప కన్నీరు పెట్టుకున్నారు. చెరో రెండున్నరేళ్ల ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అప్పట్లో యడియూరప్పకు కుమారస్వామి హ్యాండిచ్చారు.
తన టర్మ్ పూర్తి కాగానే బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు కుమారస్వామి. ఆ సమయంలో మోసం చేశారంటూ యడియూరప్ప ఏడ్చారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా ప్రజల మధ్యకు వెళ్లి వరసగా కన్నీరు పెట్టుకున్నారు యడియూరప్ప. ఆ కన్నీటికి సానుభూతి వర్షించింది. ఎన్నికల తర్వాత యడియూరప్ప సీఎం అయ్యారు.
అయితే టర్మ్ పూర్తి కాకుండానే.. రెండోసారి కూడా ఆయన దిగిపోయారు. అవినీతి ఆరోపణల మధ్యన యడియూరప్పను అప్పట్లో బీజేపీ హైకమాండ్ తప్పించింది. ఆ సమయంలో కూడా యడియూరప్ప కన్నీరు పెట్టుకున్నారు.
కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికలయిన తర్వాత పూర్తి మెజారిటీ లేకపోయినా, యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడింది. బలం నిరూపించుకోలేక దిగిపోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా యడియూరప్ప అసెంబ్లీలో రాజీనామా ప్రకటన చేసి భావోద్వేగపూరితమయ్యారు.
ఆ తర్వాత రెండేళ్లలోపే కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చారు. యడియూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజీనామా చేశారు. ఈ సారి కూడా యడియూరప్ప కన్నీళ్లు పెట్టుకుంటూ పదవి వదులుకుంటున్న ప్రకటన చేశారు.
ఇక కొత్త సీఎం ఎవరనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. ఈ జాబితాలో ఎనిమిది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే విశ్వేశ్వరహెగ్డే, బసనగౌడ పాటిల్, అరవింద్ బెల్లాడ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.