“అయ్యయ్యో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇంటర్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు అల్లాడిపోతున్నారు. తమ పిల్లల్ని ఐఐటీ, నీట్ ర్యాంకర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఏపీ విద్యార్థులంతా ఇంటర్ మీడియట్ చదువు కోసం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు.” కొన్నిరోజులుగా ఈనాడులో వస్తున్న బ్యానర్ వార్తలివి.
ఈ వార్తల వెనక ఈనాడు ఉద్దేశం పిల్లల భవిష్యత్ ఎంతమాత్రం కాదు. కేవలం కార్పొరేట్ కాలేజీలకు అనుమతులు ఆగిపోయాయనే కారణంతో.. పెయిడ్ వార్తలుగా ఇవి బ్యానర్ ఐటమ్స్ స్థాయికి చేరుకున్నాయి.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ చేయడంపై 'ఈనాడు' కొన్ని రోజులుగా ఇలా విషం చిమ్ముతూనే ఉంది.
దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాస్త తీవ్రంగానే స్పందించారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు కొమ్ము కాయొద్దంటూ హెచ్చరించారు.
ఆన్ లైన్ ప్రవేశాలపై గందరగోళం సృష్టించి పాత విధానానికి వెళ్లి కార్పొరేట్ రాజ్యం ఏర్పాటు చేయాలనుకుంటే కుదరదని చెప్పేశారు. సంస్కరణల్లో భాగంగానే ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాలు చేపట్టినట్టు తెలిపారు మంత్రి.
రాష్ట్రంలో ఈ ఏడాది 6.34లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు. కరోనా ప్రభావంతో 100 శాతం మంది ఉత్తీర్ణులు కావడంతో ఈ సంఖ్య బాగా పెరిగింది. ఇక వీరి కోసం ఇంటర్లో 5,83,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్, ఐటీఐ, డ్రాపవుట్స్.. లాంటి వారిని పక్కనపెడితే.. అందుబాటులో ఉన్న ఇంటర్ సీట్లు చాలా ఎక్కువ. అయితే అదే టైమ్ లో కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం షాకిచ్చింది.
సెక్షన్ కి 80 మందిని 40 మందికి తగ్గించింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరైన బిల్డింగ్ లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం.. ఇలాంటి కారణాలతో ప్రైవేట్ కాలేజీలపై వేటు పడింది.
దీంతో కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టడం అనే అంశాన్ని ఈనాడులాంటి పత్రికలు భుజానికెత్తుకున్నాయి. కౌన్సిలింగ్ లో తమకు కావాల్సిన కాలేజీలు కనిపించడం లేదనే కారణంతో విద్యార్థులంతా హైదరాబాద్ తరలివెళ్తున్నారంటూ తప్పుడు కథనాలు వండి వార్చింది. ప్రభుత్వ కాలేజీల్లో వసతులు లేక, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారని వార్తలిచ్చింది.
విద్యారంగంలో జగన్ తీసుకొస్తున్న సమూల మార్పుల్లో ఇంటర్మీడియట్ ప్రక్షాలన కూడా ఒక భాగమే. ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా ఫీజుల నియంత్రణ కూడా ప్రభుత్వం చేతుల్లోకి వస్తోంది. దీంతో మధ్యతరగతి తల్లిదండ్రులకు భారీ ఊరట లభిస్తోంది. అయితే కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్టపడుతుండటంతో.. జగన్ సర్కారుపై దుష్ర్పచారం మొదలైంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించారు కానీ ఓ సెక్షన్ మీడియా మాత్రం జీర్ణించుకోలేకపోతోంది.