కుప్పం ఓట‌మిపై ఎల్లో ప‌త్రిక ప‌చ్చి నిజాలివే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఘోరంగా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ ఓట‌మిపై చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శ‌లు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఓట‌మికి కార‌ణాలు తెలుసుకుని,…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఘోరంగా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ ఓట‌మిపై చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శ‌లు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఓట‌మికి కార‌ణాలు తెలుసుకుని, లోపాలు స‌రిదిద్దుకోడానికి బ‌దులు అధికార పార్టీ వైసీపీపై బుర‌ద చ‌ల్లారు. అస‌లు అక్క‌డి ఓట‌మిని త‌మ పార్టీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేద‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేసి, పార్టీ శ్రేణుల్ని మ‌రింత ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఈ నేప‌థ్యంలో కుప్పం మున్సిపాల్టీలో ఓట‌మిపై స‌మీక్షించేందుకు బుధ‌, గురువారాల్లో మంగ‌ళ‌గిరిలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న స‌మావేశం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టారు. ఈ స‌మావేశానికి కుప్పం నుంచి టీడీపీ నాయ‌కులు, క్రియాశీల‌క కార్య‌క‌ర్తలు కూడా వెళ్లారు. 

మంగ‌ళ‌గిరిలో అధినేత స‌మీక్ష సంద‌ర్భంగా బాబు అనుకూల పత్రిక ఆంధ్ర‌జ్యోతి జిల్లా సంచిక‌లో ఆల‌స్యంగానైనా ప‌చ్చి నిజాలు రాయ‌డం గ‌మ‌నార్హం. ఈ దఫా అయినా కుప్పం టీడీపీలో ప్రక్షాళన జరుగుతుందా అని శ్రేణులు ఆశగా నిరీక్షిస్తున్నాయంటూ కొండంత న‌మ్మ‌కంతో నిజాల్ని నిర్మొహ‌మాటంగా రాయ‌డం విశేషం.

కుప్పం మున్సిపాల్టీలో టీడీపీ ఓట‌మిపై ఎల్లో ప‌త్రిక‌లో రాసిన ఆణిముత్యాలు ఏంటంటే…

*మొత్తం 25 వార్డుల్లో వైసీపీ ఒక వార్డును ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు మరో 18 వార్డులను పోటీలో గెలుచుకుని మున్సిపల్‌ పీఠాన్ని వశం చేసుకుంది. టీడీపీ 6 వార్డులకు పరిమితమైంది.

*పార్టీలోని సీనియర్‌ నేతల ఒంటెత్తు పోకడలు, అధికార పార్టీ వారితో ఉన్న వ్యాపార సంబంధాలే పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యానన్నది కార్యకర్తల వాదన.

*కుప్పం టీడీపీలో 30 ఏళ్ళుగా నాయకత్వ మార్పు లేదు. దశాబ్దాల తరబడీ కార్యకర్తలు కార్యకర్తలుగానే మిగిలిపోయారు. దీని పర్యవసానమే గత మూడు వరుస ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ క్రమేపీ తగ్గుతూ వస్తోంది.

* సీనియర్‌ నాయకులపై ఫిర్యాదుల‌ను చంద్ర‌బాబు పట్టించుకోలేదు. అందువల్లే కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.

*దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ, పోలీసు, అధికార యంత్రాంగాలు సహకరించడం వంటివి జరిగినా కూడా కుప్పం మున్సిపాలిటీలో ఈ స్థాయి ఓటమికి నేతల నిర్వాకమే కారణమని కార్యకర్తల వాదన.

* అధికారంలో వున్నపుడూ, ప్రతిపక్షంగా మారాక కూడా నేతలు వైసీపీ నాయకులతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని, దానివల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు.

*మున్సిపల్‌ ఎన్నికల్లో వీధుల్లో షోలు తప్ప, కనీసం ఇంటింటికీ వెళ్ళి ప్రజల్ని ఓటు అడగడానికి కూడా టీడీపీ నాయకులు మొహమాటపడ్డారు.  

వైసీపీ నాయ‌కుల‌తో టీడీపీ నేత‌లు వ్యాపారాలు చేస్తూ, పార్టీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా రాశారు. మ‌రీ ముఖ్యంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ నేతలు ఇంటింటి వెళ్లి ఓటు అడగ‌లేద‌ని రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

వైసీపీ అరాచ‌కం వ‌ల్లే కుప్పంలో ఓడిపోయామ‌ని టీడీపీ అగ్ర‌నేత‌లు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా… అంతిమంగా సొంత పార్టీ నేత‌ల నిర్వాక‌మే ఘోర ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌ని ఎల్లో ప‌త్రిక రాయ‌డం విశేషం. ఆల‌స్యంగానైనా నిజాల్ని రాసి… చంద్ర‌బాబును మేల్కొల్ప‌డానికి స‌ద‌రు ప‌త్రిక ప్ర‌య‌త్నించింద‌ని చెప్పొచ్చు.