ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వస్తే.. హైదరాబాద్ పేరు మార్చేస్తారట.
ఇదీ యోగిగారి బంపర్ ఆఫర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తమకు అధికారం ఇస్తే హైదరాబాద్ పేరు మారిపోతుందని సెలవిచ్చారు. బహుశా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ పేరును మార్చే అవకాశం లేకపోవచ్చు.
దానికి అసెంబ్లీ తీర్మానమో మరోటో అవసరం కావొచ్చు. కాబట్టి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేసి, ఆపై తెలంగాణలో బీజేపీకి అధికారం అప్పగిస్తే.. అప్పుడు హైదరాబాద్ పేరు మారిపోతుంది!
ఇదీ బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు దక్కేది! బతుకులు మార్చండి స్వామీ అంటే.. నగరాల పేర్లు మారుస్తామని అంటున్నారు బీజేపీ వాళ్లు. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లోనే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ అంటూ ఏదో మార్చినట్టుగా ఉన్నారు. దాని వల్ల ఆ ఊర్లో రైల్వే నేమ్ ప్లేట్ మారడం తప్ప మరేం మారిందో యోగి గారికే తెలియాలి!
హైదరాబాద్ అనే పేరు పెట్టింది ఎవరైనా.. తెలుగు వాళ్లు దాన్ని డెవలప్ చేసుకున్నారు. పేరుతో నిమిత్తం లేకుండా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ ఆకర్షించగలిగింది. హైదరాబాద్ అనే పేరు ఏ అమెరికన్లనో భయపెట్టలేదు, విదేశీ పెట్టుబడులను ఆపలేదు! రేపు భాగ్యనగరం అని బీజేపీ వాళ్లు పెట్టినా.. విదేశీ కంపెనీలు కొత్తగా ఎగేసుకు వచ్చేదేమీ ఉండదు.
పాత సామాన్లకు మాట్లేస్తాం.. కళాయి కొడతాం.. అన్నట్టుగా ఊర్లకు పేర్లు మారుస్తాం, స్పెల్లింగులు మారుస్తాం అనేవి కాకుండా.. కాస్త బతుకులను మారుస్తామని బీజేపీ వాళ్లు ప్రచారం చేసుకుంటే.. జనాలు కాస్త ఆలోచిస్తారేమో!