ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆయన కుటుంబం శోకసంధ్రలో మునిగిపోయింది. తన ఎదుటే, తన చేతుల్లోనే భర్త ప్రాణాలు పోవడాన్ని గౌతమ్ భార్య శ్రీకీర్తి జీర్ణించుకోలేకున్నారు. అపోలో ఆస్పత్రిలో గౌతమ్ మృతదేహాన్ని చూస్తే శ్రీకీర్తి కన్నీరుమున్నీరైంది. గౌతమ్ మరణవార్త తెలిసిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిల వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి భార్య శ్రీకీర్తిని విజయమ్మ, షర్మిల ఓదార్చే ప్రయత్నం చేశారు. తుది శ్వాస విడిచే చివరి క్షణం వరకూ భర్తతో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శ్రీకీర్తి తల్లడిల్లారు. గుండె నొప్పిగా ఉందని చెప్పిన అనంతరం కుప్ప కూలిపోవడం, అనంతరం వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చిన వైనాన్ని విజయమ్మ, షర్మిలకు శ్రీకీర్తి వివరించారు.
గౌతమ్ కుప్ప కూలిన వెంటనే ఆస్పత్రికి తీసుకురావడం, వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయిందని, అందనంత దూరాలకు తన భర్త వెళ్లిపోయారని శ్రీకీర్తి కన్నీటిపర్యంతమయ్యారు. విధి రాతను ఎవరూ తప్పించుకోలేరని, ధైర్యంగా ఉండాలని గౌతమ్ భార్యతో పాటు కుటుంబ సభ్యుల్ని విజయమ్మ, షర్మిల ఓదార్చారు.
తాము కష్టాల్లో ఉన్న సమయంలో మొదటి నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబం వెన్నంటి ఉండడం, మరీ ముఖ్యంగా జగన్‌తో గౌతమ్ సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ, అన్ని వేళలా తమ కుటుంబం అండగా ఉంటుందని విజయమ్మ, షర్మిల ఈ సందర్భంగా వారిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.