ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో షర్మిల పార్టీ ఊసులో లేదు. అక్కడ కనీసం నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఆ పార్టీ తరఫు నుంచి. అలాగే ఈ బై పోల్ లో నిరుద్యోగుల చేత దండిగా నామినేషన్లను దాఖలు చేయిస్తామంటూ మొదట్లో షర్మిల పార్టీ ప్రకటించుకుంది. చివరకు అది కూడా చేయలేదు!
పుట్టీ పుట్టగానే సత్తా చాటాలని లేదు కానీ, ఒక ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కోసం అయినా పోరాడేంత సత్తా షర్మిల పార్టీకి ఉండి ఉంటే, దీనిపై ఆమె చేసే ప్రయత్నాలు ఎంతో కొంత ఆశాభావాన్ని కలిగించేవేమో! ఒకవైపు ఉప ఎన్నిక జరుగుతున్న చప్పుడు చేయలేకపోతున్న షర్మిల పార్టీ ఇప్పుడు ఆమె సుదీర్ఘ పాదయాత్ర తో వార్తల్లో నిలుస్తూ ఉంది.
నాలుగు వందల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా షర్మిల చేపట్టబోయే పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ పాదయాత్రలో భాగంగా షర్మిల సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాటు నడవనున్నారు. 90 నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర జరగనుంది.
షర్మిలకు పాదయాత్ర కొత్త అయితే కాదు. ఈ యాత్ర నిర్వహణకు సంబంధించి శారీరక, మానసిక సామర్థ్యం ఆమెకు ఉండవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో ఆమె ఇలాంటి యాత్రను సాగించింది కాబట్టి.. ఇప్పుడు నడవడం ఆమెకు పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతటి సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టడం మాత్రం రాజకీయంగా సాహసమే.
షర్మిల పార్టీకి తెలంగాణలో అభిమానగణం ఉండొచ్చు. అయితే అభిమానాలు రాజకీయంగా గెలిపించలేవు. అందులోనూ కేవలం తమ పార్టీకి ఊపు ఉంటుందనుకున్న చోటు మాత్రమే షర్మిల పని చేయడం లేదు. ఏకంగా తెలంగాణ మొత్తం యాత్రను చేపడుతున్నారు. చాలా పెద్ద పోరాటానికే ఆమె రెడీ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు.
షర్మిల పార్టీకి కొద్దో గొప్పో ఊపు ఉంటే.. ఇలా పోరాడితే ఆ రాజకీయం రసత్తరంగా ఉండేది. అయితే ఇప్పటి వరకూ ఆమె పార్టీకి తెలంగాణలో ఎంత బేస్ ఉందో ఎక్కడా బయటపడటం లేదు. అయినా షర్మిల సుదీర్ఘ యాత్రకు వెనుకాడకుండా ముందుకు సాగుతున్నట్టుగా ఉన్నారు. మరి ఇది నిష్ఫలమో.. లేక ఈ యాత్ర నుంచినే ఆమె రాజకీయ ఎదుగుదల మొదలవుతుందో!