Advertisement

Advertisement


Home > Sports - Cricket

రొనాల్డో క‌థ ముగుస్తోందా..!

రొనాల్డో క‌థ ముగుస్తోందా..!

సాక‌ర్ లో ప్ర‌స్తుత ప్ర‌పంచ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. వాస్త‌వానికి ఫుట్ బాల్ లో రొనాల్డో అనే పేరులోనే ఒక రైమింగ్ ఉంది. గ‌తంలో ఇదే పేరుతో బ్రెజిల్ లో ఒక స్టార్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ ఉండేవాడు. 2002 ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో బ్రెజిల్ ను గెలిపించింది ఒక రొనాల్డోనే. అలాగే అదే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ronaldinho పేరుతో ఇంకో ఆట‌గాడు బ్రెజిల్ త‌ర‌ఫున మెరుపులా రాణించాడు. ఇలా ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ లో రొనాల్డో అనే పేరుకే ఒక రిథ‌మ్ ఉంది.

ప్ర‌స్తుతానికి సాక‌ర్ అభిమాన‌గ‌ణంలో క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి వ‌ర్ణించ‌న‌ల‌వి కాదు. సోష‌ల్ మీడియాలో అత‌డికి ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంతా కాదు. ఇన్ స్టాగ్ర‌మ్ లో అత‌డి ఫాలోయింగ్ గంట‌గంట‌కూ ల‌క్ష‌ల్లో పెరుగుతూ ఉంటుంది! ఇక సాక‌ర్ ఫీల్డ్ లో రొనాల్డో విన్యాసాల వీడియోలు, అత‌డి గురించి సెర్చింగ్, అత‌డి బ్రాండ్ వ్యాల్యూ మొద‌లుకుని.. అత‌డు ఇన్ స్టాలో పెట్టే పోస్టుకు తీసుకునే డ‌బ్బులు..ఇవ‌న్నీ హాట్ టాపిక్సే! ఆ మ‌ధ్య ఒక ప్రెస్ మీట్లో ఒక కూల్ డ్రింక్ బాటిల్ ను అత‌డు అడ్డుగా ఉంద‌ని తీసి ప‌క్క‌న పెట్టేస్తే... ఆ మ‌రుస‌టి రోజు నుంచి ఆ కంపెనీ స్టాక్స్ ప‌త‌నం బాట ప‌ట్టాయి! అదీ రొనాల్డో అంటే!

ఇక ఆట విష‌యంలో అత‌డి గురించి ఫ్యాన్స్ చెప్ప‌డ‌మే కాదు. ఈ ప్ర‌పంచంలో ఎవ‌రు బెస్ట్ ఫుట్ బాల‌ర్ అంటే .. త‌న పేరును త‌నే ప్రక‌టించుకోగ‌ల ధీశాలి ఈ పోర్చుగ‌ల్ ప్లేయ‌ర్!

ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్ విష‌యంలో కూడా రొనాల్డో భారీ అంచ‌నాల మ‌ధ్య‌నే నిలిచాడు. ఈ సారి పోర్చుగ‌ల్ ను ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌ప‌డ‌మే కాదు, ఆ గెలుపు కూడా అర్జెంటీనా మీద‌నో, స్పెయిన్ మీద‌నో, ఫ్రాన్స్ మీద‌నో ద‌క్కాల‌నేది రొనాల్డో సంక‌ల్పం! 

ప్ర‌స్తుతానికి ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో పోర్చుగ‌ల్ ప్ర‌స్థానం కూడా బాగా సాగుతోంది! మ‌రి అంతా బాగున్నా.. ఎటొచ్చీ ఇప్పుడు పోర్చుగ‌ల్ ఆట విష‌యంలో రొనాల్డో పాత్ర త‌గ్గిపోతోంది! అదే పెద్ద వింత‌. ఎంత‌లా అంటే.. స్విట్జ‌ర్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో పోర్చుగ‌ల్ ఈ స్టార్ ప్లేయ‌ర్ ను ప‌క్క‌న పెట్టి ఏకంగా 6-1 గోల్స్ తో నెగ్గింది! ఇదే ఇప్పుడు ప్ర‌పంచ‌క‌ప్ కు సంబంధించి హాట్ టాపిక్ అవుతోంది.

స్విస్ పై పోర్చుగ‌ల్ జ‌ట్టు గోల్స్ వ‌ర్షం కురిపించింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది. ఈ భారీ విజ‌యంలో రొనాల్డో పాత్ర లేదు! ఈ మ్యాచ్ కు ముందు రొనాల్డోకు ఫైన‌ల్ లెవ‌న్ లో అవ‌కాశం ఇవ్వ‌లేదు ఆ జ‌ట్టు మేనేజ‌ర్. ఏదో నామ‌మాత్రంగా మైదానంలోకి అడుగుపెట్టినా ఈ విజ‌యంలో రొనాల్డోకు ప్రాధాన్య‌త లేదు! పోర్చుగ‌ల్ విజ‌యం సాధించ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు, ఆ విష‌యంలో రొనాల్డో కాంట్రాబ్యూష‌న్ లేక‌పోవ‌డం మాత్రం పెద్ద ఆశ్చ‌ర్యం. ఇంకా చెప్పాలంటే ఈ సారి ప్రంప‌చ‌క‌ప్ లో ఇత‌డి మెరుపులేమీ లేవు. అందుకే మేనేజ‌ర్ కూడా ధైర్యంగా ప‌క్క‌న పెట్ట‌గ‌లిగాడు!

అందులోనూ రొనాల్డోకు వ‌య‌సు మీద ప‌డుతూ ఉంది. గ‌తంలో ఉన్నంత వాడీవేడీ ఇక ఉంటుందా అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. స్టార్ డ‌మ్ ను చూసుకుని.. ఇత‌డిని క‌చ్చితంగా మైదానంలోకి నింపేంత అవ‌స‌రం లేద‌ని పోర్చుగ‌ల్ జ‌ట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. కీల‌క సంద‌ర్భాల్లో కూడా ప‌క్క‌న పెట్టేయ‌డానికి వెనుకాడటం లేదు. ఫుట్ బాల్ కు సంబంధించి బ‌ల‌మైన ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఉన్న‌దేశం అది.  కొత్త కుర్రాళ్లు ఉత్సాహంగా వ‌స్తూ ఉంటారు. అలాంట‌ప్పుడు స్టార్ కే అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లు లేవు మేనేజ‌ర్ కు. మ‌రి పోర్చుగ‌ల్ జ‌ట్టు మేనేజ్ మెంట్ ఇత‌డిని ప‌క్క‌న పెట్టేయ‌డానికి రెడీ కావ‌డంతో.. ఇక యూరోపియ‌న్ ఫుట్ బాల్ లీగ్ లు కూడా రొనాల్డోకు ప్రాధాన్య‌త ను త‌గ్గించే అవ‌కాశం ఉంది.

మొన్న‌టి వ‌ర‌కూ ఆ జ‌ట్లు ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టి అయినా రొనాల్డోతో కాంట్రాక్ట్ కోసం ముప్పుతిప్ప‌లు ప‌డేవి. అయితే ఇక‌పై ఆ క్రేజ్ ఉండ‌క‌పోవ‌చ్చు. రొనాల్డోను వ‌దలుకోవ‌డానికి కూడా క్ల‌బ్ లు ఇక ఏ మాత్రం వెనుకాడ‌వు అని విశ్లేషిస్తున్నారు సాక‌ర్ ఎన‌లిస్టులు. రొనాల్డో క్రేజ్, స్టార్ డ‌మ్ అంతా అలాగే ఉన్నా.. ఆట‌గాడిగా మాత్రం అత‌డి ప్రాధాన్య‌త త‌గ్గిపోతోంద‌నేది ప్ర‌ముఖంగా వినిపిస్తున్న విశ్లేష‌ణ‌. అది కూడా ఖ‌తార్ లో ఫిఫా ప్రపంచ‌క‌ప్ మొద‌ల‌య్యాకా, అది క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ వ‌ర‌కూ చేరిన త‌ర్వాత వినిపిస్తున్న విశ్లేష‌ణ‌. మ‌రి మిగిలిన మ్యాచ్ లతో ఈ ఆట‌గాడి భ‌వితవ్యంపై మ‌రింత క్లారిటీ రావొచ్చు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?