cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సమ్మోహనం

సినిమా రివ్యూ: సమ్మోహనం

రివ్యూ: సమ్మోహనం
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: శ్రీదేవి మూవీస్‌
తారాగణం: సుధీర్‌బాబు, అదితి రావు హైదరి, నరేష్‌, పవిత్ర లోకేష్‌, తనికెళ్ళ భరణి, రాహుల్‌ రామకృష్ణ, అభయ్‌ తదితరులు
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: జూన్‌ 15, 2018

ఒక అతి సామాన్యుడితో ఒక సినిమా సూపర్‌స్టార్‌ ప్రేమలో పడుతుందా? అంత తేలిక కాని ఈ ఘట్టాన్ని కన్విన్సింగ్‌గా చూపించడంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రతిభ తెలుస్తుంది. టాలీవుడ్‌ ట్రెండ్‌కి తగిన సినిమాల జోలికి పోకుండా, తనకంటూ ఒక కంఫర్ట్‌ జోన్‌ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త జోనర్స్‌ని ట్రై చేస్తూ దర్శకుడిగా తనకో మార్కు ఏర్పరచుకున్న ఇంద్రగంటి ఈసారి కూడా కొత్త బ్యాక్‌డ్రాప్‌నే తీసుకున్నాడు.

సినిమాలు, సినిమా వాళ్ల మీద సదభిప్రాయం లేని కుర్రాడు, ఒక రైజింగ్‌ సూపర్‌స్టార్‌కి దగ్గరగా వుండే అవకాశమొస్తుంది. ఆమె 'సమ్మోహనశక్తి'కి ఆకర్షితుడవుతాడు. కానీ అద్దాల మేడలోని అమ్మాయిలందరిలానే ఆమె కూడా ఒక చెప్పుకోలేని సమస్యతో లోలోపలే మదనపడుతూ వుంటుంది. అదే ఈ ప్రేమకి అడ్డంకిగాను మారుతుంది. దానిని ఈ జంట ఎలా దాటతారనేది సింపుల్‌గా 'సమ్మోహనం' కథ.

సినీ తారతో ఒక సామాన్యుడు మహా అయితే సెల్ఫీ దిగగలడు. కానీ ఆమె మనసుని దోచుకునేంత దగ్గరగా వెళ్లగలడా? సినిమా వాళ్లు విలాసవంతమైన ఇళ్ళు అద్దెకి తీసుకుని షూటింగ్స్‌ చేస్తుంటారనేది తెలిసిందే. అదే పాయింట్‌ మీద ఈ లవ్‌స్టోరీకి ఫౌండేషన్‌ వేసాడు దర్శకుడు ఇంద్రగంటి. హీరో ఇంట్లో షూటింగ్‌కి వచ్చిన హీరోయిన్‌కి అనుకోకుండా తెలుగు కోచ్‌ అవుతాడతను. దాంతో ఇద్దరూ దగ్గరయ్యే అవకాశం కుదుర్తుంది. తప్పించుకోలేని పరిస్థితిలో ఆమె ఓసారి వాళ్ల ఇంట్లోనే వుండిపోవాల్సి వస్తుంది. అది ఒకరిని ఒకరు ఇంకాస్త తెలుసుకునే అవకాశాన్నిస్తుంది.

ఎవరైనా చెప్తే నమ్మశక్యం కానట్టుండే విషయాన్ని దర్శకుడు నమ్మేటట్టుగా తీర్చిదిద్దాడు. అందుకే ఈ ప్రేమకథ అసహజమైనదే అయినా కానీ తెరపై చూస్తుంటే ఎక్కడా 'ఇది సాధ్యమేనా?' అనిపించదు. కథ చెప్పడమంటూ వస్తే ఎలాంటి క్లిష్టమైన, సంక్లిష్టమైన కథనయినా ఒప్పించేలా చెప్పవచ్చుననే దానికి ఇదో కొత్త రుజువు. ఇక ఈ సెటప్‌లో కామెడీకి చోటు ఎలా ఇవ్వడం? ఇక్కడా ఇంద్రగంటి చాతుర్యం చూపించాడు.

హీరో తండ్రికి (నరేష్‌) సినిమాలంటే పిచ్చి. నటుడు కావాలనే కలని అణచిపెట్టి ముప్పయ్యేళ్లు వైవాహిక జీవితం గడిపేసి, రిటైర్‌ అయ్యే దశలో తనలోని నట తృష్ణ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ పాత్ర చిత్రణతోనే బోలెడంత వినోదం పండింది. ఇక ఈ క్యారెక్టర్‌ని వాడుకుంటూ, సినిమా షూటింగ్‌ నేపథ్యంలో కావాల్సినంత కాలక్షేపం అయిపోయింది.

తెలుగు సినిమా పడికట్టు పద్ధతులపై సెటైర్లు సంధించిన ఇంద్రగంటి మీడియానీ వదలలేదు. 'క్లిక్‌ బెయిట్‌' హెడ్డింగులతో వార్తలు ప్రచురించే వెబ్‌సైట్లకి చురకలు వేసాడు. నిర్మాతల కొడుకులని బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దే పద్ధతులని ఎండగట్టాడు. అసంబద్ధపు సంభాషణలు రాసే రచయితలపై, తెలుగు సినిమాల్లో వుండే హింసాత్మక సన్నివేశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

పాత్రల పరిచయం, సినిమా షూటింగ్‌ నేపథ్యం, మొగ్గ తొడిగిన ప్రణయం... ఇలా పలు అంశాలతో ప్రథమార్ధం చాలా హాయిగా, సందడిగా సాగిపోతుంది. అయితే ఒక్కసారి ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చిన తర్వాత కథ రొటీన్‌ ట్రాక్‌లో పడిపోతుంది. ఇక్కడ హాస్యానికి కూడా తావు లేకపోవడంతో ఒకింత భారంగా ముందుకి కదులుతుంది. అసలే మందకొడి గమనమేమో కాసేపు సమ్మోహనం 'సమ్‌-మోహనం'గానే మిగిలిపోనుందా అనే అనుమానాలని కూడా కలిగిస్తుంది. అయితే చివరి అరగంటలో మరోసారి చలనం తెచ్చి, మరొక్కసారి నరేష్‌ పాత్రకి విజృంభించే ఛాన్స్‌ కల్పించి, చక్కని సంభాషణలు, సంవాదాలతో ఫీల్‌ గుడ్‌ నోట్‌లో ముగుస్తుంది.

హీరోయిన్‌ ఫ్లాష్‌బ్యాక్‌గా చూపించిన బాయ్‌ఫ్రెండ్‌ స్టోరీ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. పైగా ఆ వ్యవహారం మొతాన్ని హరితేజ నెరేషన్‌లో అలా అనర్గళంగా చూపించేయడం వల్ల ఎఫెక్టివ్‌గా కూడా తోచదు. హీరో హీరోయిన్ల మధ్య దూరం ఏర్పడడానికి తగిన సంఘర్షణ వుండాల్సింది.

చెప్పుకుంటే పరిష్కారం దొరికే బాధతో అతడిని ఆమె దూరంగా పెట్టడం, తను ఏకాంతంలో చెప్పిన మాటలు సినిమాలో పెట్టుకుందనే నెపంతో అతను ఆమెని వెళ్లగొట్టడంలో తగినంత కాన్‌ఫ్లిక్ట్‌ లేదు. విడిపోవడానికి కారణంగానే వుంది తప్ప విడిపోవాల్సినంత సంఘర్షణ లేదక్కడ. ఫస్ట్‌, లాస్ట్‌ యాక్ట్‌లని చాలా చులాగ్గా రాసేసిన ఇంద్రగంటి మిడిల్‌ సిండ్రోమ్‌కి లోనయ్యాడు. అయితే స్వతహాగా తనకున్న సెన్సాఫ్‌ హ్యూమర్‌ వల్ల ఒకే సీన్‌తో మళ్లీ సినిమాని ట్రాక్‌ మీదకి తీసుకుని రాగలిగాడు.

సుధీర్‌బాబు నటుడిగా ఎంత పరిణితి చెందాడనేది తెలియడానికి ఇందులో చాలానే సన్నివేశాలున్నాయి. ఎంతటి భావోద్వేగాన్ని అయినా సటిల్‌గా చూపించే పాత్రలో అతను ఒదిగిపోయాడు. నిజంగానే హీరోయిన్‌తో లవ్‌లో పడిపోయి, తన క్యారెక్టర్‌ని చిన్నబుచ్చుకున్న కుర్రాడిలానే కనిపిస్తాడంటే అతిశయోక్తి కాదు. అదితిరావు సమ్మోహశ శక్తిగా సరిగ్గా సరిపోయింది. కళ్లు చెదిరే అందానికి తోడు గుండె లోతుల్లోని భావాల్ని పలికించే హావభావాలు, నయనాలు తన సొంతం.

ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ ప్రేమకథకి డ్రైవింగ్‌ ఫోర్స్‌ అయింది. నరేష్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలు దక్కించుకుంటున్నాడు. ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో నరేష్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. రాహుల్‌ రామకృష్ణ కూడా కామెడీలో ఒక చెయ్యి వేసాడు. పవిత్ర లోకేష్‌కి మంచి పాత్ర దక్కింది. ఒకమ్మాయితో రిజెక్ట్‌ కాబడడం తప్పు కాదని చెబుతూ సుధీర్‌కి జీవిత పాఠం చెప్పే సీన్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వెన్నెముక అయ్యారు. వివేక్‌ సాగర్‌ సంగీతం ఈ చిత్రానికే ప్రధానాకర్షణ కాగా, విందా ఛాయాగ్రహణం కథలోని ఛార్మ్‌ని ఫ్రేమ్స్‌లో నింపగలిగింది. దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ చక్కని ప్రతిభ చూపించిన ఈ చిత్రంలో మాటల రచయితగాను ఫుల్‌ ఫామ్‌లో చెలరేగిపోయాడు. అర్థవంతమైన సంభాషణలు, కదిలించే మాటలకి తోడు విసుర్లు, వ్యంగ్యాస్త్రాలతో టాప్‌ ఫామ్‌లో వున్నట్టనిపించాడు.

'సమ్మోహనం'లో తెలుగు సినిమా పోకడలపై సెటైరికల్‌గా తీసిన 'కుమ్మేస్తా' లాంటి చిత్రాలని ఆస్వాదించే ప్రేక్షకులకి ఈ చిత్రం రుచించదేమో గానీ, హార్ట్‌ టచింగ్‌, ఫీల్‌ గుడ్‌ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం సంతృప్తినిస్తుంది. మరీ నిదానంగా నడిపించకుండా, మిడిల్‌ పార్ట్‌ని మరీ అంత రొటీన్‌గా మలచకుండా వున్నట్టయితే సమ్మోహన శక్తి మరింత పెరిగేదేమో కానీ ఇప్పటికీ దీనికున్న ఆకర్షణలతో ఒకసారి నిక్షేపంగా చూసి రావచ్చు. నవ్వించే హాస్యానికి తోడు మెప్పించే అనుభూతులకి కూడా ఇందులో లోటు లేదు.

బాటమ్‌ లైన్‌: సమ్మోహనమే!
- గణేష్‌ రావూరి