cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: క్రైమ్‌: బ్యాంకుకు టోకరా వేసి లక్ష పౌండ్లు...2/4

ఎమ్బీయస్‌: క్రైమ్‌: బ్యాంకుకు టోకరా వేసి లక్ష పౌండ్లు...2/4

పోగుపడిన 8 వేలడాలర్లు చూసి అబ్బే, యింతేనా అన్నాడు జార్జి. 'ఈసారి  దీన్నే దక్షిణ అమెరికాలో భారీ స్థాయిలో రిపీట్‌ చేద్దాం. లండన్‌కు తక్కిన యూరోప్‌కు అయితే టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఉంది కానీ దక్షిణ అమెరికాతో ఉత్తరప్రత్యుత్తరాలే గతి. వాళ్లకు అనుమానం వచ్చి వీళ్లకు ఉత్తరం రాసిన ఓడలో ఉత్తరం వచ్చి, సమాధానం వెనక్కి వెళ్లేందుకు 40 రోజులు పడుతుంది.' అన్నాడు. మేక్‌కు మళ్లీ పనిబడింది. ఈసారి బ్రెజిల్‌లో బ్యాంకుల పేర ఎల్‌సిలు, ఉత్తరాలు తయారయ్యాయి. మేక్‌కు పోర్చుగీసు భాషాప్రావీణ్యం అక్కరకు వచ్చింది. 1872 జూన్‌ 18న ఓడ దిగగానే 10 వేల పౌండ్ల దొంగ ఎల్‌సిని ఎన్‌క్యాష్‌ చేసుకున్నారు. ఆ తర్వాత అదే పనిలో ఉండి, ఆగస్టు మధ్యకు లండన్‌ చేరేసరికి వాళ్ల దగ్గర బోల్డు డబ్బు పోగైంది. అదంతా వారెన్‌ పేర ఉన్న ఖాతాలో జమ చేయడం, తీయడం యథావిధిగా చేశారు. సరాసరిన అతని ఖాతాలో 67 వేల పౌండ్లు బాలన్సు ఉండేది.

దాంతో అతను ఆ బ్రాంచ్‌లో పెద్ద ఖాతాదారుగా పేరుబడ్డాడు. ఎవరైనా ఖాతాలో లావాదేవీలు చూసి గుడ్లు తేలేయాల్సిందే. దేశవిదేశాలకు చెందిన చెక్కులు, డ్రాఫ్టులు డిపాజిట్‌ కావడం, ఎన్‌క్యాష్‌ అయ్యాక డబ్బు బయటకు తీయడం... యిలా యివన్నీ చూస్తే ఈయనెవరో పెద్ద వ్యాపారస్తుడురా బాబూ అనుకోక తప్పదు. బ్యాంక్‌ మేనేజరు కల్నల్‌ ఫ్రాన్సిస్‌ కూడా అదే అనుకున్నాడు - సెప్టెంబరులో ఆస్టిన్‌ స్వయంగా తనను కలవడానికి వచ్చినపుడు! ఆస్టిన్‌ దర్జా అదీ చూసి ముచ్చటపడ్డాడు. పైగా ఆస్టిన్‌ 'అమెరికాలో యిప్పుడే పేరు తెచ్చుకుంటున్న పుల్‌మన్‌ రైల్‌కార్లను (బోగీలు) యూరోప్‌కు పరిచయం చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది వియన్నాలో జరగబోయే ఎగ్జిబిషన్‌లో వాటిని ప్రదర్శిద్దామని నా ఆలోచన. ఇక్కడి రైల్వే సిస్టమ్స్‌ను అధ్యయనం చేస్తున్నాను. ఆ బోగీలను యిక్కడే తయారు చేయించేందుకు స్థలాల గురించి వెతుకుతున్నాను.' అని చెప్పుకోవడంతో ముగ్ధుడై పోయాడు.

'ఆ బోగీ ఒక్కొక్కటి 4 వేల పౌండ్ల ఖరీదుంటుంది. అందువలన నా ఖాతాలో భారీగానే లావాదేవీలుంటాయి. కాంట్రాక్టర్లకు వాళ్లకూ అడ్వాన్సులు యివ్వడాలు, మెటీరియల్‌ కొనడాలు అవీ ఉంటాయి కదా. నాకు అవసరం పడితే బిల్‌ డిస్కౌంటింగ్‌ రూపంలో ఋణసదుపాయం కూడా యివ్వాల్సి వుంటుంది.' అని చెప్పాడు. 'దానికి యిబ్బందేమీ లేదు' అని చెప్పాడు మేనేజరు. 'సరే, నా దగ్గర 8 వేల పౌండ్ల పోర్చుగీసు బాండ్లు ఉన్నాయి. వాటిని జేబులో పెట్టుకుని ఊళ్లు తిరుగడం మతి లేని పని. మీ దగ్గర సేఫ్‌ కస్టడీలో ఉంచండి.' అన్నాడు ఆస్టిన్‌. ఆ బాండ్స్‌ నిజమైనవే. అవి చూసి మేనేజరు ఆస్టిన్‌ను పూర్తిగా నమ్మేశాడు.

కానీ జార్జి జాగ్రత్తలు జార్జివి. 'మన దొంగ పత్రాలు బయటపడే ప్రమాదం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురం కలిసి ఎక్కడా ఉండకూడదు. వేరేవేరే చోట్ల ఉండాలి. మారు పేర్లు తప్ప అసలు పేర్లు ఎప్పుడూ ఉపయోగించకూడదు. పగలు కలవకూడదు. ఫిన్స్‌బరీ సర్కస్‌లో మూలగా ఉన్న ఓ కఫే చూశాను. దాని వెనక్కాల గదిలో కూర్చుంటే ఎవరి కంటా పడం.' అన్నాడు. దాన్ని అక్షరాలా పాటించారు కానీ అక్టోబరు నెలలో ఉల్లంఘించారు. సందర్భం అలాటిది. లండన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో లొసుగు గురించి వెతుకుతున్నారు కదా, అదేమిటో మేక్‌ కనుగొన్నాడు. కనుక్కోగానే ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్న జార్జికి టెలిగ్రాం పంపి వెంటనే రప్పించాడు. ముగ్గురూ విక్టోరియా హోటల్లో కూర్చుని బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూండగా మేక్‌ వివరించాడు.

బ్యాంకులంటే ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం, ఆ డబ్బును ఎవరికైనా అప్పిచ్చి వడ్డీ సంపాదించడం మాత్రమే చేయవు. వ్యాపారస్తుల మధ్య అనుసంధానం చేయడం వాటి ప్రధాన వృత్తి. నాగపూరులో ఉన్న ఒక దుప్పట్ల వ్యాపారస్తుడి నుంచి హైదరాబాదులోని దుకాణదారు సరుకు ఆర్డరు యిచ్చాడనుకోండి. నాగపూరతను సరుకు లారీకి ఎక్కించి, లారీ రిసీటు (ఎల్‌ఆర్‌) హైదరాబాదు వాడికి పంపిస్తాడు. హైదరాబాదతను సరుకు డెలివరీ తీసుకుని నాగపూరతనికి యివ్వాల్సిన డబ్బు నాగపూరు పంపించివేస్తాడు. తెలిసున్నవాళ్లయితే ఫర్వాలేదు. కానీ కొత్తవారు ఒకరినొకరు నమ్మడం ఎలా? అందుకని నాగపూరతను ఆ ఎల్‌ఆర్‌ను హైదరాబాదులోని బ్యాంకు వాళ్లకు పంపుతాడు. హైదరాబాదు దుకాణదారు బ్యాంకులో డబ్బు కట్టేసి, ఆ ఎల్‌ఆర్‌ తీసుకుంటాడు. హైదరాబాదు బ్యాంకు నాగపూరు వ్యాపారికి డబ్బు పంపించి వేస్తుంది. ఆ విధంగా యిద్దరి మధ్య బ్యాంకు సంధానకర్తగా ఉంటుంది.

పోనుపోను హైదరాబాదు దుకాణదారు మీద నాగపూరు వ్యాపారస్తుడికి నమ్మకం పెరిగిందనుకోండి. అప్పుడు సరుకు తీసుకుని అమ్ముకుని మూణ్నెళ్ల తర్వాత డబ్బు పంపినా ఫర్వాలేదనుకుంటాడు. మరి అప్పటిదాకా అతనికి డబ్బు సమకూరేదెలా? అందువలన నాగపూరులోని తన బ్యాంకు వద్దకు వెళ్లి నాకు హైదరాబాదులో ఫలానా వ్యక్తి నుంచి మూణ్నెళ్ల తర్వాత డబ్బు రావాలి. అందువలన ఆ డబ్బు మీరు నాకు ముందుగానే యిచ్చేయండి. మా లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు యివిగో అని యిస్తాడు. అతని మీద నమ్మకం ఉంటే బ్యాంకు ఆ 'బిల్‌ ఆఫ్‌ ఎక్స్‌ఛేంజ్‌' లేదా సింపుల్‌గా బిల్‌ని డిస్కౌంట్‌ చేసుకుని అంటే కొంత కమిషన్‌ పట్టుకుని అతనికి డబ్బిచ్చేస్తుంది. హైదరాబాదులో తన బ్రాంచ్‌కు కానీ, తనకు బ్రాంచ్‌ లేకపోతే అనుబంధంగా ఉన్న బ్యాంకు బ్రాంచ్‌కు కానీ పంపిస్తుంది. హైదరాబాదు దుకాణదారు వాళ్ల దగ్గరకు వెళ్లి ఆ బిల్లుపై నేను మూణ్నెళ్లలో డబ్బు కట్టేస్తానని రాసిచ్చి, ఆ ఎల్‌ఆర్‌ తీసుకుని వెళ్లి సరుకు డెలివరీ తీసుకుంటాడు. మూణ్నెళ్లలోపున డబ్బు కట్టేయకపోతే, అవతల నాగపూర్‌ వ్యాపారికి అతని బ్యాంకుతో తగాదా వస్తుంది. వాళ్లు డబ్బు తిరిగి కట్టేయమంటారు. సరుకుల రవాణా లేకపోయినా కూడా మరే కారణం చేతనైనా కూడా బిల్లు తీసుకోవచ్చు.

దేశదేశాల్లో యిదే తరహా బ్యాంకింగ్‌ నడుస్తుంది. అమెరికాలో అయితే ఫలానా వాళ్ల దగ్గర్నుంచి నాకు డబ్బు రావాలి అని బిల్లు యిచ్చి డిస్కౌంట్‌ చేయమంటే, వాళ్లు అవతలి వాళ్ల దగ్గర్నుంచి కన్ఫర్మేషన్‌ తీసుకుంటారు, బిల్లు నిజమా కాదా అని. దాన్ని అథెంటికేట్‌ చేసి సంతకం పెట్టమంటారు. కానీ బ్రిటన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో నమ్మకం ఎంత బలంగా ఉందంటే యిలాటివి చేయరు. మూణ్నెళ్ల దాకా ఊరుకుని, గడువు రాగానే బిల్లు పంపించి, డబ్బు తెప్పించుకుంటారు. ఈ విషయాన్ని మేక్‌ ఒక ప్రయోగంతో కనిపెట్టాడు. అతని బేరింగ్‌ బ్రదర్స్‌ అనే ప్రఖ్యాతి చెందిన ఫైనాన్స్‌ హౌస్‌ వద్ద డబ్బు కట్టి ఒక బిల్లు లండన్‌ అండ్‌ వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంకు పేర తీసుకున్నాడు. బ్యాంకుకి పట్టుకుని వచ్చి డిస్కౌంట్‌ చేయమన్నాడు. వాళ్లు తక్షణం చేసి డబ్బిచ్చేశారు కానీ వెరిఫికేషన్‌ కోసం బేరింగ్‌ బ్రదర్స్‌కి పంపలేదు. ఈ లొసుగు మేక్‌ కనుక్కున్నాడు.

ఇది వినగానే జార్జి మొదట నమ్మలేదు. కానీ తనూ కొంత పరిశోధించి నిజమే అని తెలుసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకును మోసం చేసే మార్గం తెరుచుకుంది. దొంగ బిల్లులు అనేకం సృష్టించి, వారెన్‌ తన బ్యాంకును డిస్కౌంట్‌ చేయమని అడుగుతాడు. అతను పెద్ద ఖాతాదారు కాబట్టి బ్యాంకు డిస్కౌంట్‌ చేసి అతని ఖాతాలో డబ్బు వేసేస్తుంది. వేరే బ్యాంకులో ఆస్టిన్‌ యింకో ఖాతా తెరిచి, ఇక్కణ్నుంచి అక్కడకు చెక్కు ద్వారా నిధులు బదిలీ చేసి, అక్కణ్నుంచి డబ్బు రూపేణా విత్‌డ్రా చేస్తే సరి. మొదటి బిల్లు నుంచి మూడు నెలలు గడిచేదాకా మోసం బయటపడదు. ఈలోగానే బిచాణా ఎత్తేస్తే సరి. దీనికి కావలసినది మరో బ్యాంకులో ఖాతా, దాన్ని నడిపే వ్యక్తి. ఆస్టిన్‌ కాంటినెంటల్‌ బ్యాంకు లాంబార్డ్‌ స్ట్రీట్‌ బ్రాంచ్‌లో డిసెంబరులో 1300 పౌండ్లతో 'ఛార్లెస్‌ హార్టన్‌' పేరుతో ఒక ఖాతా తెరిచాడు.

దీన్ని నడిపే నమ్మకస్తుడైన వ్యక్తి ఎవరాని ఆలోచించి, ఆస్టిన్‌ పాత స్నేహితుణ్ని ఎడ్విన్‌ నోయెస్‌ను అమెరికా నుంచి రప్పిస్తే మంచిదనుకున్నారు. అతను ఫోర్జరీలు చేసే ఓ చిన్నకారు మోసగాడు. ఓ నేరంలో పట్టుబడ్డి న్యూజెర్సీ జైల్లో ఏడేళ్ల శిక్ష అనుభవించి అప్పుడే బయటకు వచ్చాడు. 29 ఏళ్లు. డబ్బుకి కటకటలాడుతున్నాడని తెలిసి వెయ్యి డాలర్లు ముందుగా పంపి, లండన్‌ వచ్చేయి అన్నారు. అతను వెంటనే ఓడెక్కి వచ్చేశాడు. వచ్చి ప్లానంతా విన్నాక భయపడ్డాడు. అప్పుడు జార్జి అతనికి నచ్చచెప్పాడు - 'చూడు, క్రిస్‌మస్‌కు యీ ఆట మొదలుపెడతాం. మొత్తం వ్యవహారం మూణ్నెళ్లలో అంటే మార్చి 25కి ముగిసిపోతుంది. నేను ఎందుకైనా మంచిదని మూడు వారాల మార్జిన్‌ కూడా పెట్టుకున్నాను. మార్చి మొదటివారానికే ముగించేస్తాను. దీనిలో ఆస్టిన్‌ ఒక్కడే బయటకు కనబడే దోషి. రెండు మారుపేర్లతో రెండు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, దొంగ బిల్లులు యిచ్చినందుకు అతన్నే నేరస్తుడిగా చూస్తారు.

ఆస్టిన్‌ జనవరి మూడోవారంలోనే యింకో దేశం వెళ్లిపోతాడు. ఆపై తను స్వయంగా బ్యాంకుకి వెళ్లడు. అతని పేర నేనే మొత్తమంతా పోస్టు ద్వారా నిర్వహిస్తాను. నా పేరు ఎక్కడా ఉండదు. ఇక మేక్‌ అంటావా, అతనిదంతా తెరచాటు వ్యవహారమే. రకరకాల ఫోర్జరీలు చేస్తాడు కానీ వాటిని బ్యాంకులో యిచ్చేది అతను కాదు. ఇక బయటకు కనబడేది నువ్వు మాత్రమే. కాంటినెంటల్‌ బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసి పట్టుకురావడం, దాన్ని పౌండ్లలో, డాలర్లలో, వేరే విదేశీ కరెన్సీలో మార్చడం, బాండ్లు కొనడం, బంగారం కొనడం, అవన్నీ మాకప్పగించడం నీ పని. అయితే యిదంతా నువ్వు నీ యజమాని అయిన ఛార్లెస్‌ హార్టన్‌ కోసం చేశావు తప్ప ఆయన అసలు పేరు ఆస్టిన్‌ అని కూడా నీకు తెలియదని నువ్వు బుకాయించవచ్చు. ఆస్టిన్‌కు, నీకు ముందస్తు పరిచయం లేదని చూపించేందుకు నేను పథకం వేశాను. ఇదంతా సవ్యంగా నిర్వహిస్తే నీకు 5% వాటా.' అని. నోయెస్‌ ఒప్పుకున్నాడు.

అప్పుడు జార్జి అతన్ని గుమాస్తాలు వేసుకునే డ్రెస్సు వేసుకోమన్నాడు. ఒక చీప్‌ హోటల్లో ఉండమన్నాడు. క్లర్కు ఉద్యోగం గురించి వెతుకుతున్నట్లు ఒక దినపత్రికలో ఆరు రోజుల పాటు ప్రకటన యిప్పించాడు. దానికి 50-60 జవాబులు వచ్చాయి. కొన్నాళ్లు పోయాక ఆస్టిన్‌ హార్టన్‌ పేరుతో నోయెస్‌ ఉండే హోటల్‌కు వెళ్లి 'మీ హోటల్లో ఉండే నోయెస్‌ను ఇంటర్వ్యూ చేయాలి' అని చెప్పి ఆ సిబ్బంది వింటూండగానే ఇంటర్వ్యూ చేశాడు. కాస్సేపయ్యాక 'సరే, నీకు ఉద్యోగం యిస్తాను. మనం ఒక అగ్రిమెంటు రాసుకుందాం. మా లాయరు దగ్గరకు రా' అన్నాడు. డేవిడ్‌ హోవెల్‌ అనే లాయరు చేత అగ్రిమెంటు రాయించాడు కూడా.  'ఈ యాడ్‌ కాగితం, దానికి వచ్చిన రెస్పాన్సు, యీ అగ్రిమెంటు నిరంతరం నీ బ్యాగ్‌లో ఉంచుకో. నువ్వెప్పుడైనా పట్టుబడితే యివి చూపించి అమాయకుణ్నని చెప్పి తప్పించుకోవచ్చు. హోటల్‌ సిబ్బంది కూడా సాక్ష్యం చెప్తారు.' అని జార్జి చెప్పాడు. నోయెస్‌ను   ఆస్టిన్‌ కాంటినెంటల్‌ బ్యాంకుకు తీసుకెళ్లి తన గుమాస్తాగా పరిచయం చేశాడు. తన తరఫున అన్నీ అతనే చూస్తాడని చెప్పాడు.

ఇక దొంగ బిల్లులు తయారు చేసే మేక్‌ గురించి చెప్పాలంటే దురదృష్టవశాత్తూ అతని బుద్ధి పెడదారులు పట్టింది కానీ లేకపోతే అతను గొప్ప కళాకారుడు కావలసినవాడు. వీళ్లు ఊళ్లు తిరిగేటప్పుడు అతను కనబడిన చోటల్లా రకరకాల రంగుల్లోని పేపర్లు, పెన్నులు, పాళీలు, ఇంకులు, రబ్బరు స్టాంపులు, లక్క సీళ్లు సేకరిస్తూ వచ్చాడు. ఒక్కో బ్యాంకుది, ఒక్కో ఫైనాన్షియల్‌ సంస్థది ఒక్కో రకమైన శైలి, ఒక్కో రకమైన స్టేషనరీ, ఒక్కో రకమైన లెటరింగు. ఏది ఎప్పుడు పనికి వస్తుందో తెలియదని యితను అన్నీ పోగేశాడు. నమూనా బిల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఫారాలు షాపుల్లో అమ్ముతూంటారు. విదేశాలు వెళ్లినపుడు ఫ్రెంచ్‌, జర్మన్‌, డచ్‌, ఇటాలియన్‌, రష్యన్‌, టర్కిష్‌, అరబిక్‌ భాషల్లో దొరికేవి కూడా కొనుక్కుని వచ్చాడు. ఏదైనా సంస్థ లెటర్‌హెడ్‌ నకిలీ తయారుచేయాలంటే, దాని కంపెనీ సీల్‌ (స్టాంప్‌) నకిలీ చేయాలంటే మంచి నైపుణ్యం ఉన్న ప్రింటర్‌ దొరకాలి.  కొన్ని చెక్కవి, కొన్ని మెటల్‌వి, కొన్ని రబ్బరువి బ్లాక్స్‌ తయారు చేయగలగాలి. వాడికి మరీ సందేహాలు రాకూడదు. ఇన్ని కంపెనీల స్టేషనరీ మీరెందుకు వేయిస్తున్నారని అనకూడదు. అలాటివాడు ఎవడాని మేక్‌ 40 ప్రెస్సులు తిరిగాడు. ఒక్కోటి ఒక్కోడి దగ్గర చేయించి, మొత్తమన్నీ తనే కూరిస్తే మంచిదా అనుకున్నాడు. చివరకు జేమ్స్‌ డాల్టన్‌ అనే మూగ-చెవిటి ఎన్‌గ్రేవర్‌ దొరికాడు. అతని చేతిలో అద్భుతమైన కళ వుంది. సందేహం వచ్చినా అడగడానికి నోరు లేదు. ఫోర్జరీలకు నేను రెడీ అన్నాడు మేక్‌.
(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2018)
mbsprasad@gmail.com