cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చినబాబు

సినిమా రివ్యూ: చినబాబు

రివ్యూ: చినబాబు
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: ద్వారకా క్రియేషన్స్‌, 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: కార్తి, సత్యరాజ్‌, సయ్యేషా, భానుప్రియ, విజి చంద్రశేఖర్‌, సూరి, ప్రియా భవాని శంకర్‌, అర్తన బిను, సూరి, శత్రు, యువరాణి, పొన్‌వణ్ణన్‌ తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్‌
కూర్పు: రూబెన్‌
ఛాయాగ్రహణం: వేల్‌రాజ్‌
నిర్మాత: సూర్య
రచన, దర్శకత్వం: పాండిరాజ్‌
విడుదల తేదీ: జులై 13, 2018

ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో రూరల్‌ ఫ్యామిలీ డ్రామాలు మనకి కొత్తేమీ కాదు కానీ విలేజ్‌ క్యారెక్టర్‌లోకి అవలీలగా ఒదిగిపోయే కార్తీ సాయంతో ఆ తరహా చిత్రాన్ని తమిళ స్టయిల్లో చూపించాడు పాండిరాజ్‌. చక్కని స్క్రీన్‌ ప్రెజెన్స్‌కి తోడు, ఏమాత్రం నటిస్తున్నట్టు అనిపించని సహజమైన అభినయంతో ఆకట్టుకునే కార్తీకి ఒక సాధారణ చిత్రాన్ని కూడా తన భుజాలపై మోసేసే అరుదైన టాలెంట్‌ వుంది. తొంభైవ దశకానికి చెందిన సెటప్‌, ఆ కాలం నాటి కథ, కథనాలని తలపిస్తున్నా కానీ కార్తీ తన పర్‌ఫార్మెన్స్‌తో దీనిని 'చూడదగ్గ' చిత్రంగా మార్చాడు.

'రైతు' అనేది క్వాలిఫికేషన్‌ అని గర్వంగా చెప్పుకునే కృష్ణంరాజు (కార్తీ) కథ ఇది. మగపిల్లాడిని కనడం కోసం రెండు పెళ్లిళ్ళు చేసుకున్న రుద్రరాజుకి (సత్యరాజ్‌) అయిదుగురు ఆడపిల్లల తర్వాత కృష్ణంరాజు పుడతాడు. తన కుటుంబం అంతా కలిసి వుండాలనేది రుద్రరాజు కోరిక. అక్కల కూతుళ్లు (ప్రియ భవాని శంకర్‌, అర్తన బిను) మేనమామని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తుంటారు. కానీ కృష్ణంరాజు మరో అమ్మాయిని (సయేషా) ప్రేమిస్తాడు. దీంతో కుటుంబంలో కలతలు మొదలవుతాయి.

టీవీ సీరియల్స్‌కే పరిమితం అవుతోన్న ఇలాంటి కథలని తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడో దూరం పెట్టేసింది. అడపాదడపా 'శతమానం భవతి'లాంటి చిత్రాలు వస్తున్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించడానికి ఈ తరహా చిత్రాలు తీయడానికి ఈకాలంలో తీయడానికి ఎవరూ సాహసించడం లేదు. దర్శకుడు పాండిరాజ్‌ ఎంచుకున్న సెటప్‌ పాతదే అయినా కానీ ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. రొటీన్‌ సెటప్‌లోనే ఆకట్టుకునే సన్నివేశాలు, సంభాషణలతో ఈ చిత్రంలో వినోదం డోస్‌ మిస్‌ అవకుండా చూసుకున్నాడు.

విలన్‌ పాత్ర (శత్రు) ద్వారా యాక్షన్‌కి కూడా స్కోప్‌ మిస్‌ కానివ్వలేదు. అయితే ఫైట్స్‌ అన్నీ ఒకే రీతిన వుండడం వల్ల యాక్షన్‌ పార్ట్‌ అంతగా హైలైట్‌ అవలేదు. ఇంజినీరింగ్‌, వైద్యం లానే వ్యవసాయం కూడా ఒక వృత్తిగానే భావించాలనే ఆదర్శాలని చెబుతోన్న కార్తీ పాత్ర చూసి ఇదేదో సందేశాత్మక చిత్రమనే ఫీలింగ్‌ వస్తుంది. కానీ అసలు కథ మాత్రం హీరో తాలూకు మహా కుటుంబం చుట్టే తిరుగుతుంది. తన అక్కలు, మేనకోడళ్ల ఇష్టాన్ని కాదని తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటానని అనడంతో కాన్‌ఫ్లిక్ట్‌ మొదలవుతుంది. అప్పట్నుంచీ కుటుంబంలో వచ్చిన దూరాలని తొలగించడానికి హీరో బైక్‌ వేసుకుని అందరు అక్కల ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు.

ఎమోషన్స్‌ని కరక్ట్‌గా హ్యాండిల్‌ చేయడంలో, బోర్‌ కొట్టకుండా ప్రెజెంట్‌ చేయడంలో పాండిరాజ్‌ సఫలమయ్యాడు. పసంగ చిత్రంతోనే మెలోడ్రామాని పండించడంలో తన టాలెంట్‌ చూపించిన పాండిరాజ్‌ అందులో పిల్లల ఎమోషన్స్‌ చూపిస్తే ఈసారి పెద్దల ఎమోషన్స్‌ని బాగా క్యాప్చర్‌ చేసాడు. చివరిగా ఏమి జరుగుతుందనేది ఊహించగలిగేదే అయినా ఈ ఫ్యామిలీ విడిపోకూడదనే ఫీల్‌ని కలిగించి, ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసాడు. ఈ విషయంలో దర్శకుడికి నటీనటులందరూ బాగా హెల్ప్‌ అయ్యారు.

కార్తీ, సత్యరాజ్‌, భానుప్రియ లాంటి సీజన్డ్‌ ఆర్టిస్టులే కాకుండా అర్తన, ప్రియ భవాని లాంటి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్‌ లేని యాక్టర్స్‌ కూడా ఎమోషన్స్‌ పండించారు. మనకి పరిచయం లేని తమిళ సహాయ నటులు కూడా అక్కలు, హీరో బంధువుల పాత్రల్లో సహజంగా నటించారు. సూరి సంభాషణలు మంచి కామిక్‌ రిలీఫ్‌నిస్తాయి.

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు పాటించే చాలా మంది తమిళ దర్శకులలానే పాండిరాజ్‌ ఈ ఫక్తు పల్లెటూరి చిత్రాన్ని కళ్లు చెదిరే రీతిన తెరమీదకి తెచ్చాడు. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడ్లబండి పందాలని చాలా చిత్రాల్లో చూస్తుంటాం కానీ ఇందులో వేల్‌రాజ్‌ చిత్రీకరించిన విధానం హేట్సాఫ్‌ అనిపిస్తుంది. పచ్చని పొలాలు, పంట చేలతో నిండిన అందమైన విజువల్స్‌ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇమ్మాన్‌ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆత్మగా నిలిచింది.

దర్శకుడు పాండిరాజ్‌ వినోదాన్ని, ఎమోషన్స్‌ని మిక్స్‌ చేస్తూ పాత కథనే మెప్పించేట్టు తీసాడు. సీరియస్‌ సిట్యువేషన్‌లో కూడా కామెడీ పండించిన సందర్భాలున్నాయి. కూతురు ఆత్మహత్యకి పాల్పడిన తర్వాత తాను కూడా చనిపోతానంటూ తాగుబోతు తండ్రి చేసే హంగామా నవ్విస్తుంది. వినోదాన్ని మిస్‌ కాకుండా, డ్రామా చిక్కగా పండేలా చూసుకుంటూ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులని 'చినబాబు' మెప్పిస్తాడు. కాలం చెల్లిపోయిన కథ, కథనాలు కొత్త ఆలోచనలని ఎంకరేజ్‌ చేసే ప్రేక్షకులకి రుచించకపోవచ్చు. అలాగే నేటివిటీ ఫ్యాక్టర్‌ కూడా 'చినబాబు'కి అవరోధంగా మారుతుంది.

అనువాద చిత్రాల్లోను యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న సినిమాలుంటాయి. కానీ 'చినబాబు'లో తమిళ నేటివిటీ ఎక్కువ హైలైట్‌ అవుతుంది. ఇప్పటికీ మేనమామల మీద మనసు పడే అమ్మాయిలుంటారా, ఇంకా మగపిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటినిండా పిల్లల్ని కనే తల్లిదండ్రులుంటారా, కులం పిచ్చితో 'తమ వాళ్ల' అమ్మాయిల జోలికి వచ్చిన అబ్బాయిలని చంపేస్తారా అనే అనుమానాలు సిటీలో పుట్టి పెరిగిన వారికి కలగవచ్చు కానీ ఈ పద్ధతులు, పట్టింపులు ఏమాత్రం వింత కాని ఊళ్లయితే చాలానే వుంటాయి.

బాటమ్‌ లైన్‌: ఫ్యామిలీ డ్రామా... తమిళ స్టయిల్లో!
-గణేష్‌ రావూరి