Home > Movies - Movie News
అతగాడు ఈ రూట్లోకొచ్చాడు

చాలా మంది మ్యూజిక్ డైరక్టర్లు పాటలు రావడం అప్పుడప్పుడు అలవాటే. వీళ్లలో కీరవాణి, దేవీశ్రీప్రసాద్ ముందు వరుసలో వుంటారు. ఇక రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా అప్పుడప్పుడు పాటలు రాసేస్తుంటారు. అయితే పాటల రచయితలు మాత్రం వేరే రూట్ లోకి వెళ్లడం అరుదు. మన రామజోగయ్య శాస్త్రి మాత్రం అడపాదడపా గెస్ట్ రోల్స్ లో కనిపిస్తుంటారు. ఈ పని గతంలో మిగిలిన రైటర్లు కూడా అప్పుడప్పుడు చేసారు. కానీ దాదాపుగా మరే గీత రచయిత చేసిన దాఖలాలు లేని పనిని వర్తమాన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తలకెత్తుకున్నారు.

అదే సంగీత దర్శకత్వం. ఆయన ఇప్పుడు సంగీత దర్శకుడిగా మారారు. చాలా కాలం తరువాత మరోసారి నటుడు విజయ్ చందర్ షిర్డీ సాయిగా కనిపించబోతున్న సాయి నీ లీలలు సినిమాకు అనంత్ శ్రీరామ్ పాటలు రాయడమే కాదు, స్వరాలు కూడా కూర్చబోతున్నారు. తను అంగీకరించకపోయినా, నిర్మాతలు బలవంతం చేసారని, అందుకే ఈ బాధ్యత స్వీకరిస్తున్నానని అనంత్ శ్రీరామ్ చెప్పాడు.

కానీ టాలీవుడ్ లో ఒకటే సమస్య. పాటల రచయిత సంగీత దర్శకుడిగా మారాడు అంటే, మిగిలిన మ్యూజిక్ డైరక్టర్లు అతనికి పాటలు రాసే అవకాశం ఇస్తారా అన్నదే అనుమానం. అసలే టాలీవుడ్ లో ఎవరి కోటరీలు వారివి. మ్యూజిక్ డైరక్టర్లు, డైరక్టర్ల కనుసన్నలలో వుంటేనే గేయ రచయితలకు అవకాశాలు. మరి అనంత శ్రీరామ్ తెలిసీ ఈ పని ఎందుకు టేకప్ చేసినట్లో?