Advertisement


Home > Movies - Movie News
చచ్చేంత కష్టం: ఈ మిస్టరీలు వీడేదెలా.?

యువ హీరోల్లో అగ్రస్థానానికి ఎదిగినట్టే ఎదిగి, ఇమేజ్‌ పరంగా కిందికి పడిపోయాడు ఉదయ్‌కిరణ్‌. అవకాశాలు సైతం దక్కని పరిస్థితుల్లో, మానసికంగా కుంగిపోయాడు. ఇంకోపక్క ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలోనూ సమస్యలు.. వెరసి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, 'ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు..' అని చాలామంది అప్పట్లో అభిప్రాయపడ్డారు. మరెందుకు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు.? ఇప్పటికీ ఇది మిస్టరీనే. 

తాజాగా, నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య వనితారెడ్డి చెబుతున్న మాటల్ని బట్టి, విజయ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. విజయ్‌సాయి ఆత్మహత్యపై తనకూ అనుమానాలున్నాయని ఆమె చెబుతోంది. అయితే, ఓ సెల్ఫీ వీడియో తీసుకుని, అందులో విజయ్‌ తాను ఏం చెప్పదలచుకున్నదీ చెప్పేశాడు. అందులో, వనితారెడ్డిపై చాలా తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు కూడా చేసేశాడు విజయ్‌సాయి. ఆ ఆరోపణలపై వనితారెడ్డి కూడా తీవ్రంగానే స్పందించింది. విజయ్‌కి 'దీర్ఘకాలిక అనారోగ్యం' వుందంటూ ఆమె చెప్పిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 

వనితారెడ్డి 'క్యారెక్టర్‌'పై చనిపోయేముందు విజయ్‌సాయి ఆరోపణలు చేస్తే, విజయ్‌ సాయి 'క్యారెక్టర్‌'పైనా వనితారెడ్డి ఆరోపణలు చేసేస్తున్నారు. ఏది నిజం.? అన్నది విచారణలో తేలుతుంది. ఒక్కటి మాత్రం నిజం. చచ్చేంత కష్టం రాబట్టే విజయ్‌సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'నాకు తెలిసి విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు' అంటూ సినీ నటుడు ఉత్తేజ్‌, తనకు విజయ్‌సాయితో వున్న అనుబంధాన్ని తలచుకుని, చెప్పుకొచ్చాడు. 

అవకాశాలు రాకపోవడం అనే అంశం చుట్టూ ఇలాంటి సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. సినీ పరిశ్రమలో బలవన్మరణాలంటే ముందుగా జరిగే చర్చ అదే మరి. కానీ, అది కూడా ఓ కారణమే తప్ప, అదే అసలు కారణం కాదన్నది మెజార్టీ సినీ ప్రముఖుల వాదన. కుటుంబ సమస్యలు, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందులు, ఇవి కాకుండా వేరే కారణాలూ ఆయా వ్యక్తుల బలవన్మరణాలకు కారణమని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. 

దురదృష్టమేంటంటే.. మనుషులు పోయాక, వారి మరణాలు మిస్టరీగా మిగిలిపోతుండడం. సంగీత దర్శకుడు చక్రి విషయంలోనూ ఇదే జరిగింది. చక్రి గుండెపోటుతో చనిపోయినా, ఆ మరణంపైనా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి అప్పట్లో. ఉదయ్‌కిరణ్‌ కావొచ్చు, విజయ్‌సాయి కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు. వెలిగినంతకాలం వెలిగి, చివరికి తమ మరణాలతో 'మిస్టరీ'లుగా మిగిలిపోతుండడం బాధాకరం.