Home > Movies - Movie News
నిన్న సమంత.. నేడు రకుల్‌.. రేపు ఎవరు.?

తెలంగాణ ధనిక రాష్ట్రం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే చెబుతోన్న విషయం విదితమే. ఆ సంగతెలా వున్నా, బ్రాండ్‌ అంబాసిడర్ల ఎంపిక విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడ్డంలేదు. మొట్టమొదటగా టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి, భారీగా ఆమెకు 'నజరానా' ప్రకటించి అందర్నీ విస్మయానికి గురిచేసింది తెలంగాణ సర్కార్‌. 

ఆ తర్వాత, అనూహ్యంగా సినీ నటి సమంత పేరు తెరపైకొచ్చింది. తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతని తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. తాజాగా, మరో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తెలంగాణ రాష్ట్రం తరఫున 'భేటీ బచావో భేటీ పడావో' కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యింది. బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే జస్ట్‌ ఆయా కార్యక్రమాలకు మాత్రమే అనుకునేరు.. పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితికీ ప్రచార కర్తలుగా పనిచేసేస్తున్నట్టే.! 

వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వంపైనా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పైనా సమంత ప్రశంసలు గుప్పిస్తూ, పలు వేదికలపై మాట్లాడటం, సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పోస్ట్‌ చేయడం చూస్తూనే వున్నాం. తాజాగా ఇప్పుడు అదే రూట్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా పయనిస్తోందండోయ్‌.! 

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 'బ్రాండ్‌ అంబాసిడర్‌' పేరుతో ఎవరెవర్నో తీసుకొస్తున్నారు. అజయ్‌దేవగన్‌ అన్నారు, పూనమ్‌ కౌర్‌ అన్నారు.. చిత్రంగా వీళ్ళెవరూ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కన్పించింది లేదు. మొత్తమ్మీద, సినీ పరిశ్రమ నుంచి సమంత, రకుల్‌ని 'ఎంగేజ్‌' చేసిన తెలంగాణ ప్రభుత్వం, ముందు ముందు ఇంకెంతమందిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమిస్తుందో వేచి చూడాల్సిందే.