Home > Movies - Movie News
శ్రీహరీ.. నిన్నెప్పటికీ మర్చిపోలేం.!

శ్రీహరి.. ఓ సాదా సీదా వ్యక్తి.. సినీ రంంలోకి వచ్చి 'స్టార్‌'గా ఎదిగాడు. విలన్‌ వేషాలు, కామెడీ విలన్‌ వేషాలు.. ఆ తర్వాత హీరోగా సినిమాలు.. ఆ తర్వాత విలక్షణ నటుడు.. ఇలా ఎన్నో పాత్రల్లో రియల్‌ స్టార్‌ శ్రీహరి కనిపించి, ప్రేక్షకుల్ని మెప్పించాడు. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు శ్రీహరి.

జిమ్నాస్టిక్స్‌ చేయడం ద్వారా ఎప్పుడూ కండలు తిరిగిన, ఆరోగ్యవంతమైన ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్‌ చేసే శ్రీహరి, అనూహ్యంగా అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడాడు. శ్రీహరికి ఏమయ్యింది.? ఆయనెందుకు చనిపోయాడు.? ఇదే ప్రశ్న అభిమానుల్ని కలచివేసింది. సినీ పరిశ్రమను షాక్‌కి గురిచేసింది. రోజులు, నెలలు గడిచిపోయాయి. ఈ రోజు శ్రీహరి పుట్టినరోజు.

ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున శ్రీహరి పాత్రికేయుల్ని ప్రత్యేకించి పిలిపించుకునేవాడు. అభిమానుల్ని రప్పించుకునేవాడు. అందరిచేతా 'అన్నా' అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడే శ్రీహరి, నిజంగానే అన్నలా ఎవరు ఆపదలో వున్నా ఆదుకునేవాడు. శ్రీహరి లేడన్న వాస్తవాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. 'వీ మిస్‌ యూ' అంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీహరికి నివాళులర్పిస్తున్నారు అతని అభిమానులు.

తెలుగు సినీ పరిశ్రమలో శ్రీహరి లేని లోటు పూడ్చలేనిది. కొన్ని పాత్రలు ఆయన లేక వెలవెలబోతున్నాయి. ఏ సినిమా వచ్చినా, ఈ పాత్రలో శ్రీహరి అయితేనా.. ఇరగదీసేసేవాడు.. అనే అన్పిస్తోంది అభిమానులకి. ఆయన ఆదుకున్న కుటుంబాలైతే, ఆయన లేని లోటుని ఇంకా ఎక్కువగా ఫీలవుతున్నాయి.. అలా అందరి తలంపులో శ్రీహరి ఇంకా జీవించే వున్నాడు.