Advertisement


Home > Movies - Movie News
శృతిహాసన్‌ 'కత్తి', సమంత 'కర్ర'

శృతిహాసన్‌ ఓ తమిళ సినిమా కోసం కత్తి పట్టింది. సమంత, సినిమా కోసమో ఇంకెందుకోసమోగానీ కర్ర పట్టింది. అదేనండీ, కర్రసాము నేర్చుకుంటోంది సమంత. శృతిహాసన్‌ కత్తి పట్టి పోరాటాలు చేస్తున్న ఫొటోలు బయటకొచ్చిన విషయం విదితమే. సమంత అయితే, కర్రసాముకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

సమంతకి ఛాలెంజెస్‌ అంటే ఇష్టమట. అలా, కర్రసాము నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం సమంత తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇది కాస్త పాతకాలం నాటి నేటివిటీతో కూడిన సినిమా. రామ్‌చరణ్‌ పల్లెటూరి యువకుడిలా కన్పిస్తాడు. అంటే, ఇందులో సమంత కర్రసాము చేసే అవకాశాలున్నాయేమో.! 

అయితే, సమంత మాత్రం 'కర్రసాము'ని తమిళంలో పేర్కొంది. తమిళంలో కర్రసాముని 'సిలంబం' అంటారట. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. సమంత భలేగా కర్రని తిప్పేస్తోందండోయ్‌. హీరోయిన్లు యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో కన్పించడం కొత్తేమీ కాదు. కానీ, అరుదుగా మాత్రమే హీరోయిన్లు కర్రసాము చేస్తుంటారు. ఒకానొక కాలంలో.. అంటే రెండు దశాబ్దాల క్రితం చాలామంది హీరోయిన్లకు ఈ విద్యలో కాస్తో కూస్తో ప్రావీణ్యం వుండేది. ఇప్పుడు తెలుగు తెరపై హీరోయిన్లు కర్రసాము చేయడం దాదాపు మాయమైపోయింది. మళ్ళీ ఆ ట్రెండ్‌ని సమంత కొత్తగా పరిచయం చేస్తుందేమో వేచి చూడాల్సిందే.