Home > Politics - Gossip
ఘాటు పెంచనున్న కమలదళం!

కమలం అంటే అందంగా ఉంటుంది. కొంత మంచి పరిమళాన్ని కూడా వెదజల్లుతుంది. ఇంత వరకే మనకు తెలుసు. కానీ ఈసారి కమలం ఘాటెక్కనుంది. కమలం ఘాటు అంటే ఎలా ఉంటుందో ఏపీలో చంద్రబాబునాయుడు సర్కారుకు రుచిచూపించనుంది. ఈ మేరకు వారికి అనధికారికంగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి సూచనలు కూడా అందాయి.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికిని పెంచుకోవాలని కలగంటున్న భాజపా.. ఈ అసెంబ్లీ సమావేశాలను చక్కగా వినియోగించుకోవచ్చునని, దీనిని ఎడ్వాంటేజీగా భావించాలని వారికి సూచనలు అందాయి. ఎప్పటినుంచో ఏపీలో నెంబర్ టూ స్థానానికి తాము ఎదుగుతాం అని భాజపా చెప్పుకుంటూ వస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ గైర్హాజరీ నేతృత్వంలో అనుకోకుండా.. శాసనసభలో నెంబర్ టూ పార్టీగా కనిపించే పాత్ర వారికి దక్కింది. అయితే ఆ పాత్రను ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారు? ఎలా పార్టీ గుర్తింపు ప్రజల దృష్టిలో పెంచుకుంటారు. ఇందుకు ఇప్పుడు కసరత్తు జరుగుతోంది.

సభలో ప్రతిపక్షం లేదు. మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. మనమే ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి.. అంటూ చంద్రబాబునాయుడు పదేపదే తన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు బోధించారు.

అక్కడికేదో శాసనసభలో తెలుగుదేశం తప్ప మరొక పార్టీ అస్తిత్వమే లేనట్లుగా ఆయన తమ పార్టీ వారికి హితబోధలు చేసుకోవడాన్ని కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు. సభలో ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉంటూ.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడం అంటే ఏమిటో ఈసారి చంద్రబాబు సర్కారుకు రుచిచూపించాలని వారు అనుకుంటున్నారు. ప్రస్తుతం సభలో నెంబర్ టూ వారే. ఆ స్థానంలో తాముంటే.. రాష్ట్రానికి సమస్యలపై పోరాటం పరంగా ఎంత లాభం జరుగుతుందో ఒక ట్రయల్ రన్ లాగా   ప్రజలకు రుచిచూపించడానికి ఈ అవకాశం వాడుకోవాలని వారు చూస్తున్నారు.

దానికి తగ్గట్లుగానే ఏపీలో పార్టీని విస్తరించుకోవడంపై ఇటీవలి కాలంలోనే భాజపా ఫోకస్ పెడుతోంది. ఇలాంటి సమయంలో తామేమీ తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్లు తాగే స్థితిలో లేం అని.. అవసరమైతే ఆ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపించడానికైనా సిద్ధం అని వారు ప్రజల వద్ద గుర్తింపు తెచ్చుకోవాలి. అలా జరగాలంటే ఈ అసెంబ్లీని వారు సమర్థంగా వాడుకోవాలి. ఇదే ప్రస్తుత వ్యూహం.

ఆ మేరకు ఏపీలో చంద్రబాబు అభీష్టానికి భిన్నంగా.. పార్టీని విస్తరిస్తున్న కొందరు సీనియర్ నేతలు, అసెంబ్లీలో ఉన్న వారికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిత్యం తూలనాడుతూ ఉండే భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వాళ్లు కూడా ఉండనే ఉన్నారు. ఆ రకంగా వైకాపా సభలో లేకపోవచ్చునని.. భాజపా కనీసం కొంత వరకైనా చంద్రబాబు అండ్ టీంకు చుక్కలు చూపించబోతున్నదని తెలుస్తోంది.