Home > Politics - Gossip
చంద్రబాబు స్కెచ్‌: నివ్వెరపోయిన ప్రపంచ బ్యాంక్‌

ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిథులు అమరావతిలో పర్యటిస్తున్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కార్‌ భూ సమీకరణ చేపట్టడం, ఈ క్రమంలో కొందరు రైతులు తమ భూముల్ని ఇచ్చేందుకు ససేమిరా అనడం, ఈ భూముల్లో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు సర్కార్‌ - ప్రపంచ బ్యాంకుకి అప్లికేషన్‌ పెట్టడం, రైతుల అభ్యంతరాల నేపథ్యంలో 'వాస్తవ పరిస్థితి'ని తెలుసుకోవడానికి ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిథులు అమరావతికి రావడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి గారికి 'ప్రపంచ బ్యాంక్‌ ఏజెంట్‌' అన్న ఇమేజ్‌ ఎప్పటినుంచో వుంది. ఇదిప్పటి మాట కాదు. ఆ లెక్కన, ప్రపంచ బ్యాంక్‌ని ఎలా మేనేజ్‌ చేయాలో చంద్రబాబుకి కాక ఇంకెవరికి తెలుసు.? అయినాసరే, ఈసారి పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే తయారైంది చంద్రబాబుకి. రాజధాని అమరావతికి సంబంధించి ఉండవల్లి, పెనుమాక తదితర ప్రాంతాల్లో రైతులు తమ భూముల్ని ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడంలేదు. వారంతా ఇప్పుడు తమ ఆవేదనను ప్రపంచ బ్యాంకు ప్రతినిథుల యెదుట మొరపెట్టుకుంటున్నారు. 

పరిస్థితిని ముందే ఊహించిన చంద్రబాబు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిథులకు వాదనలు విన్పించేలా చేస్తున్నారు. ఇక్కడే, ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా ప్లస్సులు, మైనస్‌లు మామూలే. ప్రపంచ బ్యాంకు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తలపండిన ఆర్థిక, సామాజిక రంగ నిపుణులుంటారక్కడ. అంతిమంగా, 'అప్పు - వడ్డీ' ఇదే కాన్సెప్ట్‌ మీద ప్రపంచ బ్యాంక్‌ పనిచేస్తుందనుకోండి.. అది వేరే విషయం. 

అయినాసరే, కొందరు రైతుల్ని తీసుకొచ్చి అమరావతికి అనుకూలంగా ప్రభుత్వం మాట్లాడిస్తున్న తీరుకి ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిథులేంటి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి, భూములు ఇచ్చిన రైతులు సైతం, రాజధాని నిర్మాణం ఎప్పటికి జరుగుతుందో తెలియక సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటప్పుడు, ప్రపంచ బ్యాంక్‌ వద్ద ప్రభుత్వానికి అనుకూలంగా వారెలా గళం విప్పగలుగుతారు.? పైగా, సమీకరణకు భూములు ఇచ్చిన రైతుల్లోనూ కొందరు, ప్రభుత్వానికి భయపడి ఆ పని చేసిన విషయాన్ని ఎలా కాదనగలం.?