Advertisement


Home > Politics - Gossip
ఆ సినిమాపై కమలదళంలో చీలికలు!

హైందవ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం లేదా కించపరచడం, ఇవన్నీ కూడా పడికట్టు మాటలే.. రాజకీయ నాయకుల నోటమ్మట ఈ పదాలు వస్తే గనుక.. ప్రతిమాట వెనుక ఒక ఓటుబ్యాంకు రాజకీయం తప్పకుండా ఉంటుందనే అనుమానించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ విషయంలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది.

కాకపోతే.. హైందవ ధర్మానికి తాము పెద్దపీట వేసేస్తున్నాం.. హిందూత్వాన్ని మేం కాపాడినట్లుగా మరెవ్వరూ కాపాడడంలేదు, కాపాడలేరు అని చెప్పుకునే భారతీయజనతా పార్టీలోనే.. ఆ సినిమా పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లోనే కొన్ని ఆ చిత్రాన్ని నిషేధించగా, మరికొన్ని నిరభ్యంతరంగా విడుదల చేసుకోవచ్చునని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. విడుదలకు ముందే సంచలనం సృష్టించడం మాత్రమే కాదు.. కమలదళంలో కూడా చీలికలు తేగలిగిన ఆ చిత్రం మరేదో కాదు.. ‘పద్మావత్’!!

దీపికా పదుకోనె ప్రధాన పాత్రధారిగా సంజయ్ లీలాభన్సాలి రూపొందిస్తున్న చిత్రం పద్మావతి.. మేకింగ్ లో ఉన్న నాటినుంచి అనేక రకాల వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్నినెలల కిందటే విడుదలకు సిద్ధం అయినప్పటికీ.. వివాదాల కారణంగానే ఆగిపోయింది. సెన్సారు వారి సూచనలతో సినిమా టైటిల్ ను పద్మావతి నుంచి పద్మావత్ గా మార్చారు. ఎన్ని చేసినప్పటికీ రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాది ప్రజల మనోభావాలను కించపరిచే ఉంటుందనే ఊహతో.. ఈ చిత్రం పై పలు రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలు పడిపోయాయి. తమాషా ఏంటంటే.. ఈ సినిమాను నిషేధించిన రాష్ట్రాలన్నీ భాజపా పాలిత రాష్ట్రాలే కావడం విశేషం. 

తొలుత ఈ చిత్రాన్ని రాజస్థాన్ నిషేధించింది. అక్కడ వాతావరణం కొంత హీట్ గా ఉన్నందున ఇది సబబే అనుకోవచ్చు.. టైటిల్ మార్చుకుని సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు వస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్, మధ్య ప్రదేశ్ కూడా ఈ చిత్రాన్ని నిషేధించాయి. అదే సమయంలో.. హిందూత్వ–భాజపా జమిలితనానికి ప్రతీకగా వారు భావించే సీఎం యోగి ఆదిత్యనాధ్ మాత్రం ఈ పద్మావత్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో దీనిపై ఎలాంటి నిషేధం ఉండదని సెలవిచ్చారు.

గుజరాత్ లో అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం కూడా ఓటు బ్యాంకుపై కొంత పనిచేస్తుందనే ఉద్దేశంతో సినిమాను నిషేధించారు. అప్పట్లో శాంతిభద్రతల కారణం చూపి.. అల్లర్లు రేగుతాయని వ్యాఖ్యానించారు.

అయితే సెన్సార్ బోర్డు సూచించిన పలు మార్పు చేర్పులు చేసిన తర్వాత కూడా.. వారి వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. గతంలో విధించిన నిషేధం ఎత్తివేయలేదు. అది కొనసాగుతుంది. సినిమా ఇక్కడ విడుదల కాదు అని మాత్రమే సీఎం విజయ్ రూపానీ చెప్పడం విశేషం. ఒక్క సినిమా విషయంలో.. కమలదళం ముఖ్యమంత్రుల అభిప్రాయాల్లోనే ఇలా చీలికలు రావడం చిత్రమే.