Home > Politics - Gossip
అంత ధైర్యం చంద్రబాబుకు ఉందా?

ఇంతకూ చంద్రబాబు నాయుడుకు అంత ధైర్యం ఉందా.. ఆయన ఆ పని చేయగలరా? అనే చర్చ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో సమానంగా సాడుతోంది. అలాంటి పనిచేయడం ద్వారా తన మీద మరిన్ని విమర్శలను కొని తెచ్చుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారా? అనేది పలువురి అనుమానం. ఇంతకూ అదేమిటా అనుకుంటున్నారు కదా.. అదే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తెలంగాణ స్పీకరుకు పంపడం!

తెదేపా నేత ఇచ్చిన టికెట్ తో గెలిచిన ఎమ్మెల్యే స్థానం గనుక.. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకే ఇచ్చేశారు. ఆ లేఖను ఆయన మీడియాకు కూడా విడుదల చేశారు. అంతే తప్ప ఆయన లేఖను తెలంగాణ స్పీకరుకు ఇవ్వనూ లేదు.. పంపనూ లేదు! అలాగని తాను ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తున్నట్లుగా అసెంబ్లీకి  కూడా రావడం లేదు. కనీసం గన్ మెన్లను కూడా వెంట ఉంచుకోనూ లేదు.

అయితే ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులో ఉంది. ఆయన ఆ లేఖను తెలంగాణ స్పీకరుకు ప్రతినిధితో పంపితే తప్ప అది ఆమోదం పొందదు. ఇది కొత్త పద్ధతేం కాదు. గతంలో తెదేపా ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి.. తన రాజీనామాను వైఎస్ జగన్ చేతికి ఇస్తే ఆయన దానిని మండలి ఛైర్మన్ కు పంపి ఆమోదింపజేశారు. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు- రేవంత్ రాజీనామాను తెలంగాణ స్పీకరుకు పంపుతారా? అంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అనేది ప్రశ్న!

ఎందుకంటే.. ఈ రాజీనామాను ఆమోదింపజేస్తే.. 22 మందిని వైకాపా నుంచి చేర్చుకున్న ఆయన సొంత పార్టీ కి సంబంధించి ఇవే నైతిక విలువలు పాటించాలి కదా.. అనే ప్రశ్న వస్తుంది. రాజీనామాను పంపకపోతే.. పార్టీ నుంచి రాజీనామా చేసి పోయిన నేత పదవిని కాపాడడానికి కష్టపడుతున్నాడనే విమర్శ వస్తుంది. సో చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందన్నమాట. ఆయన ఏం చేస్తారో మరి!